Veerabhadra Rao: ఫేస్‌బుక్‌లో మహిళ పేరుతో రిక్వెస్ట్.. రూ.2.36 కోట్లు పోగొట్టుకున్న హైదరాబాద్ టెక్కీ

ఫేస్‌బుక్‌లో మహిళ పేరుతో వచ్చిన రిక్వెస్ట్ ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని నిండా ముంచింది. ఏకంగా రూ.2.36 కోట్లు మోసపోయాడు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో నివసించే టెక్కీ వీరభద్రరావుకు గత సంవత్సరం ఆగస్టులో ఫేస్‌బుక్‌లో 'కోరా' అనే మహిళ పేరుతో ఒక రిక్వెస్ట్ వచ్చింది. తనది సింగపూర్ అని, ప్రస్తుతం ముంబైలో పని చేస్తున్నానని నమ్మబలికింది.

కొన్ని నెలల పాటు ఇద్దరు చాటింగ్ చేసుకున్నారు. తనకు వివిధ దేశాల్లో స్నేహితులు ఉన్నారంటూ వీరభద్రరావును ఒక ఫేస్‌బుక్ పేజీలో యాడ్ చేసింది. తన స్నేహితులు ఫేస్‌బుక్ స్టోర్‌లో పెట్టుబడులు పెట్టి పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జించారని, డబ్బులు ఉంటే ట్రేడింగ్ చేయాలంటూ అతనికి సూచించింది. మొదట ఆ మాటలను అతను నమ్మలేదు. కానీ ఆమె పలు సందర్భాల్లో, స్నేహితులు లాభాలు ఆర్జించారంటూ చెబుతూ అతనిని ఒప్పించింది.

ఆమె ఒక ఏపీకే ఫైల్‌ను పంపించగా, అతడు డౌన్ లోడ్ చేసుకున్నాడు. ఫేస్‌బుక్ తరహా యాప్ వీరభద్రరావు ఫోన్‌లో కనిపించింది. ఈ యాప్‌లోని స్టోర్ ద్వారా వస్తువులు కొనుగోలు చేస్తే లాభాలు ఉంటాయని, ఇంకా ఏమైనా సూచనలు కావాలంటే జర్మనీకి చెందిన తన స్నేహితురాలు బెల్లాతో మాట్లాడాలని ఆమె ఫోన్ నెంబర్ ఇచ్చింది. వీరభద్రరావు బెల్లా చెప్పినట్లుగా పెట్టుబడులు పెడుతూ వచ్చాడు.

ఇలా గత సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 12 మధ్య కాలంలో రూ.2.36 కోట్లు పెట్టుబడులుగా పెట్టాడు. అయితే ఈ యాప్‌లో అతడికి ఎప్పటికప్పుడు లాభాలు చూపిస్తున్నప్పటికీ, డబ్బులు ఉపసంహరించుకునే వెసులుబాటును ఇవ్వలేదు. తనకు లాభం లేదా తన పెట్టుబడిని ఉపసంహరించుకునే అవకాశం లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన వీరభద్రరావు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఫిర్యాదు చేశాడు.
Veerabhadra Rao
Hyderabad techie
Facebook scam
cyber crime
online fraud
investment fraud

More Telugu News