Kurre Cheralu: ప్రియురాలి ఇంట్లో తండ్రి.. ఆగ్రహంతో ప్రాణాలు తీసిన కొడుకులు

భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తండ్రి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే ఆగ్రహంతో కన్న కొడుకులే అతడిని హతమార్చారు. జిల్లాలోని రేపాక గ్రామానికి చెందిన కుర్రే చేరాలు (55) ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం ఉదయం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

చేరాలుకు భార్య, కవల కుమారులు రామ్‌, లక్ష్మణ్‌, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సుమారు 25 ఏళ్ల క్రితం చేరాలు తన గ్రామానికే చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై కుటుంబంలో గొడవలు జరగడంతో, పదేళ్ల క్రితం ఆయన తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. ఇటీవల చేపల చెరువు లీజు వ్యవహారంపై పది రోజుల క్రితం తిరిగి గ్రామానికి వచ్చి మళ్లీ పాత ప్రియురాలి ఇంట్లోనే ఉండటం మొదలుపెట్టాడు.

మూడు రోజులుగా తండ్రి ఫోన్లకు స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన కుమారులు రామ్‌, లక్ష్మణ్‌ శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి రేపాకకు చేరుకున్నారు. ప్రియురాలి ఇంట్లో ఉన్న తండ్రిని చూసి ఆగ్రహంతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చేరాలు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు.

శనివారం అర్ధరాత్రి కొడుకులు గొడ్డలితో దాడి చేశారని, అడ్డువచ్చిన మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కొని పారిపోయారని పోలీసులు పేర్కొన్నారు. అయితే, కొడుకులు కోపంతో తండ్రి తలపై బలంగా మోదడంతోపాటు కడుపులో పిడిగుద్దులు గుద్దడంతోనే తీవ్రంగా గాయపడ్డాడని, వారే ఆసుపత్రికి తరలించారని గ్రామస్థులు అంటున్నారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు కుర్రే కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Kurre Cheralu
Bhupalpally
extra marital affair
sons kill father
Repaka village
Telangana crime
murder
Hyderabad
gold chain snatching

More Telugu News