Chandrababu Naidu: నీటి సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించిన సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత' పేరుతో 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రజల భాగస్వామ్యంతో జల సంరక్షణను ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. 

ఏప్రిల్ 6 నుంచి జులై 14వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో భాగంగా నేడు రాష్ట్రంలోని సాగునీటి సంఘాల సభ్యులతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, రాబోయే 100 రోజుల ప్రణాళికపై వారికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభ సూచికగా, సీఎం చంద్రబాబు రేపు (ఏప్రిల్ 6) తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికిలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు.

100 రోజుల కార్యాచరణ.. సాగునీటి సంఘాలకు కీలక బాధ్యతలు

నీటి భద్రత కేవలం ప్రభుత్వ బాధ్యతే కాదని, ఇందులో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ బృహత్తర కార్యక్రమంలో రాష్ట్రంలోని 60 వేల మంది సాగునీటి సంఘాల సభ్యులను భాగస్వాములను చేస్తూ వారికి కీలక బాధ్యతలు అప్పగించారు. "ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకోవాలి, ప్రతి బొట్టును సంరక్షించుకోవాలి, భూగర్భ జలాలను పెంచాలి" అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 

ఇరిగేషన్, అటవీ, పంచాయతీ రాజ్, వ్యవసాయ, పశు సంవర్థక శాఖలు సమన్వయంతో పనిచేసి సాగునీటి సంఘాలకు పూర్తి సహకారం అందించాలని ఆదేశించారు. నీటి భద్రతను సాధిస్తే మిగిలిన అన్ని రంగాల్లో అభివృద్ధి దానంతట అదే సాధ్యమవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.

పక్కా ప్రణాళికతో పనులు.. జులై 14 డెడ్‌లైన్

ఈ 100 రోజుల కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికతో అమలు చేసేందుకు ప్రభుత్వం స్పష్టమైన షెడ్యూల్‌ను ప్రకటించింది. వర్షాకాలం ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రణాళికను రూపొందించారు.

ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 15 వరకు: చేపట్టాల్సిన పనుల గుర్తింపు.
ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 20 వరకు: గుర్తించిన పనులకు పరిపాలనా అనుమతుల మంజూరు.
ఏప్రిల్ 21 నుంచి జూలై 9 వరకు: క్షేత్రస్థాయిలో పనుల అమలు.
జూలై 10 నుంచి జూలై 14 వరకు: పూర్తి చేసిన పనులపై నివేదికల సమర్పణ.
ఈ షెడ్యూల్ ప్రకారం 'మిషన్ అప్రోచ్'తో పనిచేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని సీఎం అధికారులకు, సాగునీటి సంఘాల సభ్యులకు సూచించారు.

అన్నమయ్య జిల్లా స్ఫూర్తితో.. భూగర్భ జలాల పెంపే లక్ష్యం

నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపులో అన్నమయ్య జిల్లా సాధించిన ప్రగతిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. 'జలధార' పేరుతో ఆ జిల్లాలో చేపట్టిన చర్యలు అద్భుత ఫలితాలనిచ్చాయని, స్థానిక జలవనరులను వినియోగించుకుని, చెరువులను నింపి భూగర్భ జలాలను గణనీయంగా పెంచారని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో సగటున 8.7 మీటర్ల లోతున ఉన్న భూగర్భ జలాలను, కనీసం 1.5 మీటర్ల మేర పైకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించారు. వేసవికి ముందు 6 మీటర్లు, వర్షాకాలం తర్వాత 3 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.

పూడికతీత నుంచి వాటర్ బడ్జెట్ వరకు.. చేయాల్సిన పనులివే

ఈ 100 రోజుల్లో చేపట్టాల్సిన పనులపై సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఫీడర్ ఛానెళ్లను శుభ్రం చేయడం, చెరువులు, కాల్వల్లో పూడిక తీయడం, గుర్రపు డెక్కను తొలగించడం వంటి పనులను వెంటనే చేపట్టాలన్నారు. దీనివల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, వరద ముంపును కూడా అరికట్టవచ్చని తెలిపారు. 

అవసరమైన చోట చెక్ డ్యాంలకు మరమ్మతులు చేయడం, కొత్త నిర్మాణాలు చేపట్టడంపై దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యంగా, ప్రతి సాగునీటి సంఘం తమ పరిధిలో 'వాటర్ బడ్జెట్' తయారు చేసుకోవాలని సూచించారు. నీటి లభ్యత, అవసరాలపై స్పష్టమైన అంచనాతో ముందుకు సాగాలన్నారు. నీటి వృధాను అరికట్టేందుకు మైక్రో ఇరిగేషన్‌ను ప్రోత్సహించాలని కోరారు.

కరవు రహిత రాష్ట్రమే ధ్యేయం.. ప్రాజెక్టుల పూర్తిపై దృష్టి

కొద్దిపాటి శ్రద్ధ పెడితే రాష్ట్రంలో నీటి సమస్యను అధిగమించి, కరవు రహిత రాష్ట్రంగా మార్చవచ్చని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఒకప్పుడు రాయలసీమ ఎడారి అవుతుందని అన్నారని, కానీ నేడు హార్టీకల్చర్ హబ్‌గా మారిందని గుర్తుచేశారు. ఎన్టీఆర్ హయాంలో ప్రారంభించిన హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగు గంగ వంటి ప్రాజెక్టులతో పాటు, నేడు పోలవరం సహా పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు అందించడమే ప్రభుత్వ సంకల్పమని పునరుద్ఘాటించారు. 

గతేడాది (2024 మే నుంచి 2025 మే వరకు) ప్రజా భాగస్వామ్యంతో రాష్ట్రంలో భూగర్భ జలాలు 2.20 మీటర్ల మేర పెరిగాయని, అంటే సుమారు 200 టీఎంసీల నీటిని అదనంగా భూమిలో ఇంకించగలిగామని తెలిపారు. అదే స్ఫూర్తితో ఈ 100 రోజుల ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Chandrababu Naidu
Andhra Pradesh
water conservation
groundwater levels
100 day action plan
irrigation projects
water management
water budget
Jaladhara

More Telugu News