Prabhas: ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా సెట్స్ నుంచి ఫొటోలు లీక్.. షేర్ చేస్తే చర్యలు తప్పవన్న మేకర్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఫౌజీ’. ఈ సినిమా సెట్స్ నుంచి ప్రభాస్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు తాజాగా లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ కావడంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తీవ్రంగా స్పందించింది. వాటిని షేర్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించింది.

గత రెండు రోజులుగా ‘ఫౌజీ’ సెట్స్ నుంచి తీసినవంటూ ప్రభాస్ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇప్పటివరకు గోప్యంగా ఉంచిన ఆయన లుక్ బయటకు వచ్చింది. ఈ లీకులపై చిత్ర బృందం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించింది. "ఫౌజీ సెట్స్ నుంచి లీకైన చిత్రాలను కొన్ని అకౌంట్స్ ప్రచారం చేస్తున్నాయి. ఇది గట్టి హెచ్చరిక. ఇలాంటి కంటెంట్‌పై ఫిర్యాదు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని పోస్ట్‌లో పేర్కొంది. తద్వారా ఆ ఫొటోలు నిజమైనవేనని పరోక్షంగా ధ్రువీకరించింది.

తాము ఎంతో జాగ్రత్తగా నిర్మిస్తున్న సినిమాటిక్ అనుభవాన్ని ఇలాంటి లీకులు దెబ్బతీస్తున్నాయని, థియేటర్లలో అద్భుతమైన అనుభూతిని అందించేందుకు కష్టపడుతున్నామని నిర్మాతలు తెలిపారు. లీకైన కంటెంట్‌ను ఎవరూ షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. గతంలోనూ ఈ సినిమా సెట్స్ నుంచి కొన్ని ఫొటోలు బయటకు రావడం, అప్పుడు కూడా నిర్మాతలు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.

యుద్ధ నేపథ్యంలోని ఫిక్షనల్ హిస్టారికల్ లవ్‌స్టోరీగా ‘ఫౌజీ’ రూపుదిద్దుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్ ఎస్మాయిల్ నటిస్తుండగా, జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Prabhas
Fauzi
Prabhas Fauji Movie
Hanu Raghavapudi
Mythri Movie Makers
Leaked Photos
Iman Esmail
Jayaprada
Telugu Cinema

More Telugu News