Vindu Dara Singh: 'ఆదిపురుష్' లాంటి తప్పుచేయకండి: విందూ దారా సింగ్

దర్శకుడు నితీష్ తివారీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణ్’ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో, దివంగత నటుడు దారాసింగ్ కుమారుడు విందు దారాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.


గతంలో రామానంద్ సాగర్ 'రామాయణ్' సీరియల్‌లో హనుమంతుడిగా మెప్పించిన దారాసింగ్ వారసుడిగా విందూ దారాసింగ్ ఈ కొత్త చిత్రంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి లుక్ అద్భుతంగా ఉందని ప్రశంసిస్తూనే, గత చేదు అనుభవాలను గుర్తు చేశారు.


"రామానంద్ సాగర్ తీసిన రామాయణం ఒక చరిత్ర. అది ఎప్పటికీ నంబర్ వన్. నితీష్ తివారీ సినిమా ఆ స్థాయిని అందుకుంటే రికార్డులు తిరగరాయడం ఖాయం" అని విందూ దారాసింగ్ అన్నారు. ఇదే సమయంలో కొంతకాలం కిందట వచ్చిన 'ఆదిపురుష్' సినిమాను ఆయన తీవ్రంగా విమర్శించారు. "ఆదిపురుష్ ట్రైలర్ చూడగానే అది ఫ్లాప్ అని నాకు అర్థమైపోయింది. అందులో అసలు ఏం చూపించారో ఎవరికీ అర్థం కాలేదు. ముఖ్యంగా హనుమంతుడి వంటి పవిత్ర పాత్రల విషయంలో అనవసర మార్పులు చేయకూడదు" అని పేర్కొన్నారు. రామాయణం వంటి పవిత్ర కావ్యాన్ని తెరకెక్కించేటప్పుడు మూల కథ నుంచి పక్కకు జరిగినా, పాత్రలను అసురుల తరహాలో వికృతంగా చూపించినా జనాలు అస్సలు అంగీకరించరని స్పష్టం చేశారు.


ఇక, రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న రామాయణ్ చిత్రం విశేషాలు చూస్తే... దాదాపు రూ. 4 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ పౌరాణిక దృశ్యకావ్యాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా కన్నడ స్టార్ యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్ర మొదటి భాగం 2026 దీపావళి కానుకగా విడుదల కానుంది. రెండో భాగం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Vindu Dara Singh
Adipurush
Ramayan
Nitesh Tiwari
Ranbir Kapoor
Sai Pallavi
Yash
Sunny Deol
Namit Malhotra
Ramayana Movie

More Telugu News