Yuvraj Singh: నా కంటే వైభవ్‌ బ్యాట్ స్పీడ్ ఎక్కువ... మైదానం నలువైపులా షాట్లు ఆడగలడు: యువీ

భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్-రౌండర్, ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వైభవ్, త్వరలోనే టీమిండియాకు ఆడటం ఖాయమని జోస్యం చెప్పాడు. ముఖ్యంగా వైభవ్ బ్యాట్ స్పీడ్ తనకంటే మెరుగ్గా ఉందని యువీ చెప్పాడు.

13 ఏళ్లకే కోటీశ్వరుడు
2025 ఐపీఎల్ వేలంలో 13 ఏళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ జట్టు వైభవ్‌ను రూ.1.1 కోట్లకు కొనుగోలు చేయడంతో అతను ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. గతేడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, ఆడిన తొలి బంతినే సిక్సర్‌గా మలిచి తన రాకను ఘనంగా చాటాడు. ఆ తర్వాత తన రెండో ఐపీఎల్ మ్యాచ్‌లోనే కేవలం 35 బంతుల్లో సెంచరీ బాది, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా శతకం సాధించిన భారత బ్యాటర్‌గా, అత్యంత పిన్న వయస్కుడైన సెంచూరియన్‌గా రికార్డులు సృష్టించాడు.

అద్భుతమైన నైపుణ్యాలున్నాయి: యువరాజ్
ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ యువరాజ్ సింగ్.. వైభవ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో వస్తున్న కొత్త ఆటగాళ్లను చూడండి. వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా రాణిస్తున్నాడు. అతని బ్యాట్ స్పీడ్ నమ్మశక్యంగా లేదు. నా కంటే అతని బ్యాట్ స్పీడ్ బాగుంది. అంత స్పీడ్ ఉన్న ఆటగాళ్లను నేను చాలా అరుదుగా చూశాను" అని యువీ కొనియాడాడు. మైదానం నలువైపులా షాట్లు ఆడగల నైపుణ్యం అతని సొంతమని వివరించాడు. "చిన్న వయసులోనే అతనిలో ఎన్నో నైపుణ్యాలు ఉన్నాయి. వైఫల్యాలు, విజయాల నుంచి నేర్చుకుంటూ అతను మరిన్ని మ్యాచ్‌లు ఆడితే మరింత మెరుగైన బ్యాటర్‌గా ఎదుగుతాడు" అని యువీ అన్నాడు.

టీమిండియాకు ఆడటం ఖాయం
ఐపీఎల్ భారత క్రికెట్ స్వరూపాన్నే మార్చేసిందని యువరాజ్ అభిప్రాయపడ్డాడు. "ఈ కుర్రాళ్లు నేరుగా ఐపీఎల్‌లో పెద్ద సంఖ్యలో ప్రేక్షకుల ముందు ఆడుతున్నారు. అదే నిర్భయమైన ఆటతీరును అంతర్జాతీయ క్రికెట్‌లోనూ కొనసాగిస్తున్నారు. వైభవ్ కచ్చితంగా భారత్‌కు ఆడతాడని చాలా మందికి తెలుసు. ప్రస్తుతం టీ20 జట్టులో ఖాళీలు లేకపోయినా, పోటీ ఎక్కువగా ఉన్నా.. త్వరలోనే అతనికి అవకాశం వస్తుంది. అతను సిద్ధంగా ఉన్నాడని సెలక్టర్లు భావించినప్పుడు తప్పకుండా ఆడిస్తారు" అని యువరాజ్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇండియా అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వైభవ్, భవిష్యత్తులో సీనియర్ జట్టులోనూ సత్తా చాటగలడని యువీ అంచనా వేశాడు.
Yuvraj Singh
Vaibhav Suryavanshi
Indian Cricket
IPL
Rajasthan Royals
Under 19 Cricket
Bat Speed
Cricket Talent
T20 Cricket
Indian Team

More Telugu News