Shehbaz Sharif: దెబ్బకు దిగొచ్చిన పాకిస్థాన్.. రాత్రికి రాత్రే లీటర్ పెట్రోల్‌పై రూ.80 తగ్గింపు

Shehbaz Sharif Government Slashes Petrol Price by 80 Rupees
షార్ట్స్‌లో చూడండి
ఇంధన ధరల పెంపుపై తీవ్ర ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీగా పెంచిన పెట్రోల్ ధరలను రాత్రికి రాత్రే తగ్గించింది. లీటర్ పెట్రోల్‌పై ఏకంగా 80 పాకిస్థానీ రూపాయలు (పీకేఆర్‌) తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర 378 రూపాయలకు దిగివచ్చింది.

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం నాడే షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పెట్రోల్‌పై 43 శాతం, హైస్పీడ్ డీజిల్‌పై 55 శాతం ధరలను పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర 458 రూపాయలకు, డీజిల్ 520 రూపాయలకు చేరడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వంపై సామాన్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో 24 గంటల్లోపే సర్కార్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

శుక్రవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని షెహబాజ్ షరీఫ్, ధరల తగ్గింపును ప్రకటించారు. పశ్చిమాసియాలో నెలకొన్న సంఘర్షణే ఇంధన ధరల పెరుగుదలకు కారణమని అంగీకరించారు. అయితే, ధరలను నియంత్రించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కనీసం నెల రోజుల పాటు ఈ కొత్త ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. హైస్పీడ్ డీజిల్‌పై లెవీని కూడా తొలగించినట్లు తెలిపారు.

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) నుంచి భారీగా రుణాలు తీసుకుంటోంది. ఇంధన ధరల పెంపు, పన్నుల భారం వంటి కఠిన షరతులను ఐఎంఎఫ్‌ విధించడంతో పాక్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఒకవైపు ఐఎంఎఫ్‌ షరతులు, మరోవైపు ప్రజల ఆగ్రహం మధ్య నలిగిపోతోంది. ఇంధన ధరల పెరుగుదల పాకిస్థాన్ వంటి పేద దేశాల్లో ఆహార సంక్షోభానికి దారితీస్తుందని ఐఎంఎఫ్‌ సైతం ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.

ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పాక్ ప్రభుత్వం దేశంలో ఇంధన పొదుపు చర్యలు కూడా చేపట్టింది. ప్రభుత్వ కార్యాలయాల పనిదినాలను వారానికి నాలుగు రోజులకు కుదించింది. విద్యాసంస్థలకు సెలవులు పొడిగించి, ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ఆదేశించింది.
Go Back to Shorts
Shehbaz Sharif
Pakistan petrol price
petrol price drop
fuel price reduction
Pakistan economic crisis
IMF loan
fuel conservation
Pakistan fuel prices
West Asia conflict
high-speed diesel

More Telugu News