Raghav Chadha: సభలో సమోసాల ధరల గురించి మాట్లాడుతున్నారు: రాఘవ్ చద్దాపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం

పార్లమెంటులో మాట్లాడటానికి అవకాశం వచ్చినప్పుడు దేశం కోసం మాట్లాడాలి కానీ, విమానాశ్రయాల క్యాంటీన్‌లలో సమోసాల ధర గురించి మాట్లాడటం ఏమిటని రాఘవ్ చద్దాపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాఘవ్ చద్దా లేవనెత్తుతున్న ప్రశ్నలు గత కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. విమానాశ్రయాలలో సమోసాల ధరలు, టెలికం సంస్థలు రీఛార్జీని నెల రోజులకు బదుల 28 రోజులు ఇవ్వడమేమిటంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు.

ఈ క్రమంలో రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపనేతగా ఉన్న రాఘవ్ చద్దాను ఆ పార్టీ తొలగించింది. ఆయన స్థానంలో అశోక్ మిట్టల్‌ను నియమించింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ, రాఘవ్ చద్దా మధ్య మాటల యుద్ధం సాగతోంది. తానేం తప్పు చేశానని తనను పదవి నుంచి తొలగించారని రాఘవ్ చద్దా ప్రశ్నించారు. ఇలాంటి ప్రయత్నాలతో తన గళాన్ని అణచివేయగలరేమో కానీ తనను ఓడించలేరని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ మీడియా చీఫ్ అనురాగ్ దండా స్పందించారు. రాఘవ్ కొన్నాళ్లుగా భయపడుతున్నారని, మోదీకి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నారని విమర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీలోని వారంతా అరవింద్ కేజ్రీవాల్ సైనికులమని, ఇలాంటి వారు మోదీకి భయపడరని అన్నారు. మోదీకి భయపడేవారు దేశం కోసం పోరాడతారా? అని ప్రశ్నించారు.

సభలో మాట్లాడటానికి లభించే కొద్దిపాటి సమయంలో కీలక అంశాలను లేవనెత్తాలని, కానీ రాఘవ్ మాత్రం క్యాంటీన్లలో సమోసాల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేస్తే ఆయన మాట్లాడలేదని విమర్శించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానంపై సంతకం చేయడానికి తిరస్కరించారని ఆరోపించారు. పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసినా ఆయన మాత్రం సభలోనే ఉన్నారని గుర్తు చేశారు. రాఘవ్ చద్దా ప్రవర్తనతో పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు.
Raghav Chadha
Aam Aadmi Party
AAP
Samosa Price
Ashok Mittal
Arvind Kejriwal
Rajya Sabha

More Telugu News