POCSO Act: బాలిక గర్భవతిగా వస్తే పోలీసులకు చెప్పాల్సిందే!.. కర్ణాటక ఆసుపత్రులకు కొత్త నిబంధన

కర్ణాటకలోని ప్రైవేట్ ఆసుపత్రులకు అక్కడి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. 18 ఏళ్లలోపు వయసున్న బాలికలు గర్భం దాల్చిన కేసుల వివరాలను తప్పనిసరిగా పోలీసులకు తెలియజేయాలని స్పష్టం చేసింది. పోక్సో చట్టం కింద ఈ నిబంధనను అమలు చేస్తున్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ ఆదేశాలను పాటించని వైద్యులు, ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

"లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం-2012 ప్రకారం, 18 ఏళ్లలోపు బాలిక గర్భం దాల్చడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. దీని గురించి సమాచారం ఇవ్వడం తప్పనిసరి" అని ప్రభుత్వం తన మార్గదర్శకాలలో పేర్కొంది. పోక్సో చట్టంలోని సెక్షన్ 19(1) ప్రకారం, ఎవరికైనా నేరం జరిగినట్లు తెలిసినా లేదా జరగబోతోందని అనుమానం వచ్చినా, ఆ సమాచారాన్ని స్పెషల్ జువైనల్ పోలీస్ యూనిట్‌కు గానీ, స్థానిక పోలీసులకు గానీ అందించాలి.

ఈ నిబంధనను ఉల్లంఘించిన వైద్యులు, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. సమాచారం ఇవ్వడంలో విఫలమైతే, సంస్థ బాధ్యులకు ఏడాది వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అలాగే, ఇలాంటి కేసులలో బాలికల రక్షణ, పునరావాసం కోసం వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించింది.

ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు పోక్సో కేసుల వివరాలను సరిగ్గా నమోదు చేయాలని, రోగి గోప్యతను కాపాడుతూనే దర్యాప్తు అధికారులకు సహకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. తమ సిబ్బందికి, వైద్యులకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించాలని కూడా సూచించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
POCSO Act
Karnataka
minor pregnancy
child marriage
child helpline 1098
sexual assault
private hospitals
police
legal action
child protection

More Telugu News