Sunrisers Hyderabad: కోల్‌కతాపై సన్‌రైజర్స్ ఘన విజయం... ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన హైదరాబాద్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదిరిపోయే బోణీ కొట్టింది. తొలి మ్యాచ్ లో ఆర్సీబీ చేతిలో ఓడిన హైదరాబాద్ జట్టు నేడు స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పోరులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 65 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ నిర్దేశించిన 227 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతా 16 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (21 బంతుల్లో 46), అభిషేక్ శర్మ (21 బంతుల్లో 48) ఆకాశమే హద్దుగా చెలరేగి పవర్‌ప్లేలోనే స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అనంతరం హెన్రిచ్ క్లాసెన్ (35 బంతుల్లో 52) హాఫ్ సెంచరీతో రాణించగా, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (24 బంతుల్లో 39) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కోల్‌కతా బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ 4 వికెట్లు పడగొట్టాడు.

భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతా తడబడింది. ఓపెనర్ ఫిన్ అలెన్ (7 బంతుల్లో 28) మెరుపు ఆరంభం ఇచ్చినా, అది ఎక్కువసేపు నిలవలేదు. అంగ్‌క్రిష్ రఘువంశీ (29 బంతుల్లో 52) అర్ధశతకంతో ఒంటరి పోరాటం చేశాడు. రింకూ సింగ్ (35) అతనికి కొంత సహకారం అందించినా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో కోల్‌కతా 16 ఓవర్లలోనే 161 పరుగులకు ఆలౌట్ అయింది. సన్‌రైజర్స్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ 3 వికెట్లతో కోల్‌కతా పతనాన్ని శాసించాడు. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఎషాన్ మలింగ చెరో రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

సన్ రైజర్స్ తన తదుపరి మ్యాచ్ ను ఏప్రిల్ 5న లక్నో సూపర్ జెయింట్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ లో జరగనుంది.
Sunrisers Hyderabad
Sunrisers Hyderabad vs KKR
Kolkata Knight Riders
IPL 2026
Hyderabad win

More Telugu News