Ram Charan: 'రాకాస' టీమ్‌తో రామ్ చరణ్ చిట్‌చాట్.. ఇదిగో వీడియో!

సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న ఫాంటసీ కామెడీ చిత్రం 'రాకాస'. విడుదలకు సిద్ధమైన ఈ చిన్న సినిమాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి అనూహ్య మద్దతు లభించింది. ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 'పెద్ది' అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న చరణ్, తన చిత్ర షూటింగ్ సెట్స్‌కు వచ్చిన 'రాకాస' చిత్ర బృందంతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్న రామ్ చరణ్, మొత్తం టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. రామ్ చరణ్ ప్రశంసలతో తమలో కొత్త ఉత్సాహం నిండిందని 'రాకాస' చిత్ర బృందం సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేసింది. ఈ క‌ల‌యిక‌కు సంబంధించిన పూర్తి వీడియోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.

ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్‌తో పాటు హీరో సంగీత్ శోభన్, నిర్మాత నిహారిక కొణిదెల, దర్శకురాలు మనసా శర్మ తదితరులు చరణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా 'రాకాస' ట్రైలర్‌ను చూసిన చరణ్, టీమ్ మొత్తాన్ని అభినందించారు.

ముఖ్యంగా సంగీత్ శోభన్ నటనను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. "ఒక నటుడిగా నీలో చాలా ఫ్లూయిడిటీ, ఈజ్ ఉన్నాయి. అది నీ అతిపెద్ద బలం. చాలామంది అందంగా కనిపించాలని నటిస్తారు, కానీ నువ్వు అవన్నీ వదిలేసి పాత్రలో జీవించావు," అని సంగీత్‌తో అన్నారు. అంతేకాదు, "నేను కేవలం నిహారిక సోదరుడిగా ఇక్కడికి రాలేదు. మీ అందరి పనిని ఎంతగానో ఇష్టపడి, మిమ్మల్ని కలవాలని నేనే నిహారికను అడిగాను" అని చరణ్ స్పష్టం చేశారు.

ట్రైలర్‌పై మాట్లాడుతూ, "ట్రైలర్ అద్భుతంగా ఉంది. దాదాపు ఇండియానా జోన్స్ స్థాయిలో తీశారు," అని ప్రశంసించారు. పరీక్షలు ముగిసిన ఈ సమయంలో కుటుంబమంతా కలిసి చూసే చక్కటి సమ్మర్ ఎంటర్‌టైనర్ 'రాకాస' అని ఆయన అభిప్రాయపడ్డారు.

నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్‌తో కలిసి ఈ ఫాంటసీ కామెడీ చిత్రాన్ని నిర్మించారు. మనసా శర్మ ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తుండగా, తనికెళ్ల భరణి కీలక పాత్ర పోషిస్తున్నారు. రేపు (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి, ఈరోజు ఏపీ, తెలంగాణలోని ఎంపిక చేసిన నగరాల్లో పెయిడ్ ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తున్నారు. రామ్ చరణ్ మద్దతుతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.


Ram Charan
Raakasa
Sangeeth Shobhan
Niharika Konidela
Telugu Movie
Pink Elephant Pictures
Manasa Sharma
Nayanthara Sarika
Telugu Cinema
Peddi Movie

More Telugu News