K Laxman: నాడు హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు కృషి చేశారు: తెలంగాణ బీజేపీ ఎంపీ

దూరదృష్టి గల నాయకుడిగా ఆనాడు హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబునాయుడు కృషి చేశారని, విభజన తర్వాత ఏపీకి అమరావతి రాజధానిగా సంకల్పం తీసుకుని ముందుకు సాగుతున్నారని తెలంగాణ బీజేపీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని, రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఎన్డీయే కట్టుబడి ఉందని అన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.

వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం వికసిత్ రాజధాని అవసరమని ఆయన అన్నారు. రాజధాని అమరావతి కోసం 29 వేలమంది రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు. భవ్య రాజధాని కోసం ఏపీ ప్రజలు కలలు కన్నారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్పం సాకారమయ్యేందుకు వికసిత్ ఆంధ్ర నిర్మాణం అవశ్యమన్నారు. రాజధాని అవసరమని, కానీ జగన్ తన హయాంలో మూడు ముక్కలాడి రైతులు, మహిళలను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు.

రాజధాని కోసం చాలాకాలంగా పోరాడిన మహిళలకు, రైతులకు ఆయన శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. అమరావతి బిల్లు కోసం దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోందని అన్నారు. తెలుగు వారికి ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కావాలని నాడు పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేసినా, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన ప్రాణాలు త్యాగం చేశారని అన్నారు. ఆయన మరణానంతరం ప్రభుత్వం స్పందించి ఆంధ్ర రాష్ట్రం ఇచ్చిందని అన్నారు.
K Laxman
Telangana BJP
Amaravati
Andhra Pradesh
Chandrababu Naidu
AP Capital
Potty Sriramulu

More Telugu News