Rassie van der Dussen: అంతర్జాతీయ క్రికెట్‌కు ద‌క్షిణాఫ్రికా స్టార్ క్రికెట‌ర్‌ వీడ్కోలు.. వన్డేల్లో ఏబీడీ తర్వాత అతడే!

దక్షిణాఫ్రికా క్రికెట్‌లో నమ్మకమైన వైట్-బాల్ బ్యాటర్‌గా పేరుగాంచిన రాసీ వాన్ డర్ డస్సెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ ప్రకటన ద్వారా వెల్లడించాడు. దేశం తరఫున ఆడటం తన జీవితంలో దక్కిన గొప్ప గౌరవమని, ఈ ప్రయాణంలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన భావోద్వేగానికి గురయ్యాడు.

"గర్వంతో, కృతజ్ఞతాభావంతో నేను నా అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్‌ను ప్రకటిస్తున్నాను. ప్రొటీస్ జెర్సీ ధరించడం ఒక ప్రత్యేకమైన అనుభూతి. నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో దక్కిన అతిపెద్ద గౌరవం. ఈ ప్రయాణం కోసం ఎన్నో త్యాగాలు చేశాను. కానీ దక్షిణాఫ్రికా తరఫున ఆడిన ప్రతీ క్షణం ఎంతో విలువైనది" అని తన ప్రకటనలో పేర్కొన్నాడు.

దేశవాళీ క్రికెట్, వివిధ టీ20 లీగ్‌లలో రాణించిన తర్వాత 29 ఏళ్ల వయసులో లేటుగా వాన్ డర్ డస్సెన్ దక్షిణాఫ్రికా జట్టులోకి అరంగేట్రం చేశాడు. 2019లో ఇంగ్లండ్‌పై టెస్టుల్లో అడుగుపెట్టినా, అత‌డు వన్డే ఫార్మాట్‌లో అత్యద్భుతంగా రాణించాడు. దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్‌లో కీలక ఆటగాడిగా ఎదిగాడు. మొత్తం 71 వన్డే మ్యాచ్‌లలో 50కి పైగా సగటుతో 2,657 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక సగటు కలిగిన ఆటగాళ్ల జాబితాలో ఏబీ డివిలియర్స్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. తన కెరీర్‌లో 18 టెస్టులు, 57 టీ20లు కూడా ఆడాడు.

ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన వారిని రాసీ గుర్తుచేసుకున్నారు. "క్రికెట్ దక్షిణాఫ్రికా, కోచ్‌లు, మేనేజర్‌లకు నా ధన్యవాదాలు. నా భార్య లారా ప్రతీ అడుగులో నాకు తోడుగా నిలిచింది. అభిమానులు నన్ను 'మా థౌజండ్' అని పిలవడం, వాండరర్స్ స్టేడియంలో బ్యాటింగ్‌కు వెళ్తున్నప్పుడు ప్రేక్షకుల కేరింతలు ఎప్పటికీ మర్చిపోలేను" అని తెలిపాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా, తన ప్రయాణం ముగియలేదని వాన్ డర్ డస్సెన్ స్పష్టం చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో తన జట్టు 'లయన్స్' తరఫున ఆడటాన్ని కొనసాగిస్తానని, భవిష్యత్ తరాల దక్షిణాఫ్రికా క్రికెటర్లకు మార్గనిర్దేశం చేస్తానని పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లు పెద్ద కలలు కనాలని, వాటిని సాకారం చేసుకోవడానికి సర్వశక్తులు ఒడ్డాలని రాసీ సూచించాడు.
Rassie van der Dussen
South Africa cricket
Proteas
AB de Villiers
retirement
cricket news
South Africa
white-ball cricket
Lions
cricket

More Telugu News