Jodhpur Balaji Temple: జోధ్‌పూర్ ఆలయంలో మహిళా భక్తులపై దాడి.. వీడియో ఇదిగో!

రాజస్థాన్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం జోధ్‌పూర్ బాలాజీ ఆలయంలో దారుణం చోటుచేసుకుంది. దైవ దర్శనానికి వచ్చిన ఇద్దరు మహిళలపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. గర్భగుడి సమీపంలోనే వారి జుట్టు పట్టుకుని నేలపై ఈడ్చుకెళ్లి కొట్టారు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగుతోంది.

స్థానికుల సమాచారం ప్రకారం.. ఆలయంలో దర్శనం కోసం ఉన్న క్యూలైన్‌లో రెండు వర్గాల మధ్య చిన్నపాటి వాగ్వాదం మొదలైంది. ఇది కాస్తా తీవ్రమై ఘర్షణకు దారితీసింది. దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన ఓ వర్గానికి చెందిన కొందరు పురుషులు, ఇద్దరు మహిళలపై విచక్షణారహితంగా దాడికి దిగారు. నిందితులు వారి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి కాళ్లతో తన్నారు.

‘‘మమ్మల్ని కొట్టొద్దు, కాపాడండి’’ అంటూ బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఆ సమయంలో అక్కడ చాలా మంది భక్తులు ఉన్నప్పటికీ, దాడిని అడ్డుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కొందరు భయంతో చూస్తూ నిల్చోగా, మరికొందరు ఈ దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించడం గమనార్హం.

ఈ దాడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి కొందరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పవిత్ర స్థలంలో మహిళలపై ఇలాంటి దాడి జరగడంపై మహిళా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
Jodhpur Balaji Temple
Rajasthan
Jodhpur
Temple attack
Women assaulted
Balaji Temple
Viral video
Crime
Police investigation
Religious place

More Telugu News