Donald Trump: ఇరాన్‌పై యుద్ధంలో గెలిచాం.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన

Donald Trump Announces Victory in War Against Iran
షార్ట్స్‌లో చూడండి
ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ విజయం సాధించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా సైనిక చర్యలతో టెహ్రాన్ సైనిక శక్తిని పూర్తిగా నాశనం చేశామని, తమ వ్యూహాత్మక లక్ష్యాలు నెరవేరుతున్నాయని, త్వరలోనే ఈ పనిని పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్.. రాబోయే 2-3 వారాల్లో ఇరాన్‌పై దాడులు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

నెల రోజుల క్రితం ప్రారంభించిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'తో ఇరాన్‌పై వేగంగా విజయం సాధించామని ట్రంప్ తెలిపారు. "ఈ ఆపరేషన్‌తో ఇరాన్ నౌకాదళం, వాయుసేన శిథిలమయ్యాయి. వారి కీలక నాయకులు చాలామంది మరణించారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కమాండ్ వ్యవస్థను ధ్వంసం చేస్తున్నాం" అని ఆయన వివరించారు. క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించే సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయిందని పేర్కొన్నారు.

చర్చలు విఫలమైతే ఇరాన్‌ను 'రాతి యుగంలోకి' నెట్టేస్తామని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒప్పందం కుదరని పక్షంలో ఇరాన్ విద్యుత్ ప్లాంట్లను కూడా లక్ష్యంగా చేసుకుంటామని పునరుద్ఘాటించారు. పాలన మార్పు తమ లక్ష్యం కాకపోయినా, కీలక నాయకుల మరణంతో అది ఇప్పటికే జరిగిపోయిందని ట్రంప్ అన్నారు.

ఇరాన్ అణుబాంబు తయారీకి చేరువలో ఉందని, అలాంటి కిరాతక పాలన చేతిలో అణ్వాయుధం ఉండటం ప్రపంచానికే ప్రమాదమని ట్రంప్ ఆరోపించారు. అందుకే ఈ యుద్ధం అమెరికా భద్రతకు అవసరమని సమర్థించుకున్నారు. ఈ పోరాటంలో సహకరిస్తున్న ఇజ్రాయెల్, సౌదీ అరేబియా వంటి మిత్రదేశాలను ఆయన ప్రశంసించారు.
Go Back to Shorts
Donald Trump
Iran
Iran war
US military
Israel
Operation Epic Fury
Nuclear weapon
Islamic Revolutionary Guard Corps
IRGC
Tehran

More Telugu News