Purandeswari: మేం రాజకీయాలు చేయడం లేదు... మేం కోరేది ఒక్కటే: పురందేశ్వరి

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి శాశ్వతంగా నిలవాలని, ఇది రాష్ట్రానికే గర్వకారణం కావాలని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. అమరావతి అనేది కేవలం రాజధాని కాదని, అదొక విశ్వాసం, త్యాగం, సామాజిక ఒప్పందం అని ఆమె అభివర్ణించారు. అమరావతి అంశం ఒక వివాదం కాదని, ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఇదొక పరీక్ష అని పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయం కోసం, రైతుల గౌరవం కోసం, ప్రజల కోసం అమరావతిని నిలబెట్టాలని ఆమె పిలుపునిచ్చారు. ఇవాళ లోక్ సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె ప్రసంగించారు. మేము ప్రత్యేక హోదా అడగడం లేదు.. మేము రాజకీయాలు చేయడం లేదు... మేము కోరేది ఒక్కటే... న్యాయం, స్థిరత్వం, రైతుల విశ్వాసానికి గౌరవం అని ఉద్ఘాటించారు.

29,000 మంది రైతులు స్వచ్ఛందంగా 34,000 ఎకరాల భూమిని ఇచ్చారని,  ఈ 'ప్రజల రాజధాని' దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు. రైతుల త్యాగాన్ని వృథా కానివ్వకూడదని, వారి 1600 రోజుల నిరసన ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దం పడుతోందని పేర్కొన్నారు.

2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం పూర్తిగా అవివేకపూరితమైనదని పురందేశ్వరి తీవ్రంగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం రాజధాని అంశం పార్లమెంట్ పరిధిలోకి వస్తుందని ఆమె స్పష్టం చేశారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో తీవ్ర అన్యాయానికి గురైన ప్రజలు ఇప్పుడు స్థిరత్వం, న్యాయం మాత్రమే కోరుకుంటున్నారని వివరించారు.

అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భారీగా నిధులు కేటాయించిందని పురందేశ్వరి తెలిపారు. క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA)కి రూ.1500 కోట్లు, రింగ్ రోడ్ ప్రాజెక్ట్‌కు రూ.20,000 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. వీటితో పాటు హడ్కో (HUDCO) ద్వారా రూ.11,400 కోట్లు, ప్రపంచ బ్యాంకు సహకారంతో మరో రూ.15,000 కోట్ల నిధులు సమీకరించేందుకు మార్గం సుగమమైందని చెప్పారు. ఈ నిధులు అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు బలమైన పునాది వేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 
Purandeswari
Amaravati
Andhra Pradesh
AP Capital
Farmers
BJP
Central Government Funds
CRDA
Three Capitals
Andhra Pradesh Reorganisation Act 2014

More Telugu News