Iran oil: ఏడేళ్ల తర్వాత ఇరాన్ నుంచి తొలిసారి భారత్‌కు ముడిచమురు

Iran Oil Arrives in India After 7 Years
షార్ట్స్‌లో చూడండి
ఇరాన్ నుంచి ఒక చమురు ట్యాంకర్ భారత్ వైపు వస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో, సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ ముడి చమురుపై అమెరికా ఆంక్షలు ఎత్తివేసింది. దీనితో ఇరాన్ ముడిచమురు కొనుగోలుకు భారత రిఫైనరీలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి వస్తున్న చమురు ట్యాంకర్ ఏప్రిల్ 4న గుజరాత్‌లోని వాడినార్ పోర్టుకు చేరుకోనుంది.

ఈ మేరకు డేటా ఇంటెలిజెన్స్ సంస్థ కెప్లర్ వెల్లడించింది. గత నెల 4వ తేదీన ఖర్గ్ ద్వీపం వద్ద ట్యాంకర్ లోకి ముడి చమురు లోడింగ్ చేశారని తెలిపింది. ఇందులో 6,00,000 బ్యారెళ్ల ముడి చమురు ఉండొచ్చని అంచనా. 2019 తర్వాత ఇరాన్ చమురు భారత్‌కు రావడం ఇదే మొదటిసారి. అయితే ఈ చమురు కొనుగోలుదారు ఎవరనే విషయం తెలియాల్సి ఉంది.

వాడినార్‌లో రష్యాకు అతిపెద్ద వాటా కలిగిన నయారా ఎనర్జీ నిర్వహిస్తున్న రిఫైనరీ ఉంది. అదే సమయంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) నిర్వహిస్తున్న మధ్యప్రదేశ్‌లోని బినా రిఫైనరీ దిగుమతి చేసుకునే ముడిసరుకు పంపిణీ కేంద్రం కూడా ఇక్కడే ఉంది.

2019 వరకు భారత చమురు దిగుమతుల్లో 11.5 శాతం ఇరాన్ వాటా ఉండేది. 2018లో భారత్ రోజుకు సుమారు 5,18,000 బ్యారెళ్ల ఇరాన్ చమురును దిగుమతి చేసుకోగా, మే 2019 నాటికి అది రోజుకు 2,68,000 బ్యారెళ్లకు తగ్గింది. ఆ తర్వాత ఇరాన్‌పై అమెరికా ఆంక్షల కారణంగా ఆ దేశం నుంచి చమురు దిగుమతులు పూర్తిగా తగ్గిపోయాయి.
Go Back to Shorts
Iran oil
India oil import
crude oil
Vadinar port
oil tanker
Iran sanctions
Nayara Energy
BPCL
Bina Refinery

More Telugu News