: పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు షాక్.. రూ.12 లక్షల జరిమానా

ఐపీఎల్ 2026 సీజన్‌ను విజయంతో ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు జరిమానా తప్పలేదు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు అతనికి రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు.

"ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, కనీస ఓవర్ రేట్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఈ చర్య తీసుకున్నాం. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ఇది తొలి తప్పిదం కావడంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా విధించబడింది" అని ఐపీఎల్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇక‌, నిన్న రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్‌ను 162 పరుగులకే కట్టడి చేయడంలో పంజాబ్ బౌలర్లు సఫలమయ్యారు. పేసర్ వైశాఖ్ విజయకుమార్, స్పిన్నర్ యజువేంద్ర చాహల్ కలిసి ఐదు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో పంజాబ్ 19.1 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఆస్ట్రేలియా యువ బ్యాటర్ కూపర్ కనోలీ కేవలం 44 బంతుల్లో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు.

More Telugu News