Donald Trump: ఇరాన్‌లో సైనిక చర్యల ముగింపుపై ట్రంప్ కీలక ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ విషయంలో కీలక ప్రకటన చేశారు. మరో రెండు, మూడు వారాల్లో ఇరాన్‌లోని అమెరికా సైనిక కార్యకలాపాలను ముగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అధికారులతో చర్చలు కొనసాగిస్తూనే వైమానిక దాడులను కొనసాగిస్తున్న తరుణంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మంగళవారం వైట్‌హౌస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పెరిగిన ఇంధన ధరల ప్రభావం గురించి విలేకరులు ప్రశ్నించగా... "మేం ఇరాన్‌ను వీడితే చాలు, ధరలు అవే పడిపోతాయి. ఆ పని మేం త్వరలోనే చేయబోతున్నాం. మరో రెండు వారాల్లో, లేదా కొన్ని రోజులు అటూఇటూగా ఈ పని పూర్తవుతుందని భావిస్తున్నా" అని ఆయన బదులిచ్చారు.

అయితే, అమెరికా సేనల ఉపసంహరణకు ఇరాన్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదని ట్రంప్ స్ప‌ష్టం చేశారు. "వారు నాతో ఒప్పందం చేసుకోవాల్సిన పని లేదు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయలేని స్థితికి, శిలాయుగంలోకి వెళ్లినప్పుడు మేం బయటకు వస్తాం. ఒప్పందం ఉన్నా లేకున్నా అది అసంబద్ధం" అని ఓవల్ ఆఫీస్‌లో విలేకరులతో అన్నారు.

మెయిల్-ఇన్ ఓటింగ్‌లో మోసాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ దాన్ని నిరోధించడానికి ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసిన తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ చమురు ట్యాంకర్ల రవాణాకు కీలకమైన హ‌ర్మూజ్ జలసంధిని మూసివేసిన విషయం తెలిసిందే.
Donald Trump
Iran
US Military
Iran Nuclear Program
Hormuz Strait
Oil Tankers
White House
US Foreign Policy
Middle East Conflict
Mail-in Voting

More Telugu News