Nagastra-1: ఇరాన్ కు షాహెద్, అమెరికాకు లూకాస్... మనకు నాగాస్త్ర-1

ఆధునిక యుద్ధరీతి స్వరూపమే మారిపోతోంది. ఇప్పుడు భారీ యుద్ధ ట్యాంకులు, ఖరీదైన ఫైటర్ జెట్లతో పాటు తక్కువ ఖర్చుతో తయారయ్యే డ్రోన్లు ఫలితాలను శాసిస్తున్నాయి. ఈ రంగంలో ఇరాన్‌కు 'షాహెద్' డ్రోన్లు ఎలాగో, అమెరికాకు లూకాస్ వ్యూహాత్మక డ్రోన్లు ఉన్నట్టుగానే... భారత్ ఇప్పుడు 'నాగాస్త్ర-1'తో తన సత్తా చాటుతోంది.

రష్యా-ఉక్రెయిన్, అమెరికా-ఇరాన్ ఘర్షణలు ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. అదే 'వార్ ఎకనామిక్స్'. తక్కువ ధరలో వేల సంఖ్యలో తయారుచేసే కామికేజ్ డ్రోన్లు.. శత్రువుల వద్ద ఉన్న కోట్ల విలువైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను నిర్వీర్యం చేస్తున్నాయి. ఇరాన్ షాహెద్ డ్రోన్లు ఈ వ్యూహంలో విజయవంతమయ్యాయి. లక్ష్యంపై గంటల తరబడి చక్కర్లు కొట్టి, సరైన సమయంలో దాడి చేసే ఈ లోయిటరింగ్ మ్యూనిషన్లు శత్రువులకు ఆర్థికంగానూ నష్టం కలిగిస్తున్నాయి. అమెరికా లూకాస్ డ్రోన్లు కూడా చవకైనవి, అదే సమయంలో ప్రభావవంతమైనవి.

ఈ నేపథ్యంలో భారత్ కూడా స్వదేశీ పరిజ్ఞానంతో తన అమ్ములపొదిని సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగమే 'నాగాస్త్ర-1'. ఇది భారత్ తొలి స్వదేశీ లోయిటరింగ్ మ్యూనిషన్ (కామికేజ్ డ్రోన్). నాగ్‌పూర్‌కు చెందిన ఎకనమిక్ ఎక్స్‌ప్లోసివ్స్ లిమిటెడ్ దీన్ని అభివృద్ధి చేసింది. ఇది 1.5 కిలోల వార్‌హెడ్‌తో దాదాపు 30 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. భారత సైన్యం ఇప్పటికే వందల సంఖ్యలో వీటిని ఆర్డర్ చేసి, తొలి బ్యాచ్‌ను స్వీకరించింది.

నాగాస్త్ర-1 తక్కువ దూరం లక్ష్యాల కోసం కాగా, సుదూర ప్రాంతాల్లోని శత్రు స్థావరాలపై దాడికి 'ప్రాజెక్ట్ కాల్' పేరుతో మరో శక్తిమంతమైన డ్రోన్‌ను భారత్ అభివృద్ధి చేస్తోంది. ఇది ఇరాన్ షాహెద్ తరహాలో దాదాపు 1,000 కిలోమీటర్ల రేంజ్‌తో, శత్రువుల రాడార్లు, లాజిస్టిక్స్ కేంద్రాలను ధ్వంసం చేసే సామర్థ్యంతో రూపుదిద్దుకుంటోంది.

సాంకేతికంగా ముందంజలో ఉన్నప్పటికీ, ఉత్పత్తి సామర్థ్యం విషయంలో భారత్ ఇంకా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇతర దేశాలు వేల సంఖ్యలో డ్రోన్లను తయారుచేస్తుండగా, మన ఉత్పత్తి ఇంకా వందల్లోనే ఉంది. విడిభాగాల కోసం విదేశాలపై ఆధారపడటం, భారీ ఆర్డర్లు లేకపోవడం వంటివి ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయి. అయినప్పటికీ, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం, ప్రభుత్వ ప్రోత్సాహకాలతో భారత్ డ్రోన్ శక్తిగా ఎదిగేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.
Nagastra-1
India drones
kamikaze drones
loitering munition
defense technology
military drones
Indian Army
Shahed drones
Lucas drones
war economics

More Telugu News