Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ వడ్డీ రేట్లు యథాతథం

చిన్న పొదుపు పథకాలపై వడ్డీరేట్లను యథాతథంగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వంటి పథకాల వడ్డీ రేట్లలో వరుసగా ఎనిమిదోసారి ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి వర్తించిన వడ్డీ రేట్లు ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు కొనసాగుతాయని ఆర్థిక శాఖ తెలిపింది.

సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్‌వై) పథకం కింద చేసే డిపాజిట్లకు 8.2 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్లకు 7.1 శాతం వడ్డీ రేటు కొనసాగుతుంది. పీపీఎఫ్‌కు 7.1 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. పోస్టాఫీస్ పొదుపు డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లలో మార్పులేదు.

పోస్టాఫీస్ డిపాజిట్లపై 4 శాతం వడ్డీ రేటు కొనసాగుతుంది. కిసాన్ వికాస్ పత్ర పథకానికి 7.5 శాతం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకానికి 7.7 శాతం, పోస్టల్‌లో నెలవారీ ఆదాయ పథకంపై (ఎంఐఎస్) 7.4 శాతం వడ్డీ రేటు కొనసాగుతుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం చివరిసారి 2023-24 నాలుగో త్రైమాసికంలో వడ్డీ రేట్లను సవరించింది.
Sukanya Samriddhi Yojana
PPF interest rates
Small savings schemes
National Savings Certificate

More Telugu News