Donald Trump: హర్మూజ్ తెరవకపోతే ఖర్గ్ దీవిని నాశనం చేస్తాం: ఇరాన్ కు ట్రంప్ తాజా వార్నింగ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. హర్మూజ్ జలసంధిని తక్షణమే తెరవాలని, లేనిపక్షంలో ఇరాన్‌లోని ఖర్గ్ దీవితో సహా కీలకమైన చమురు బావులు, విద్యుత్ కేంద్రాలను పేల్చివేస్తామని అల్టిమేటం ఇచ్చారు. ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలను పెంచింది.

ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్, ఇరాన్‌లోని కొత్త నాయకత్వంతో చర్చలు జరుపుతున్నామని, వాటిలో గణనీయమైన పురోగతి ఉందని తెలిపారు. అయితే, ఒప్పందం త్వరగా కుదరకపోయినా లేదా హర్మూజ్ జలసంధిని తెరవకపోయినా తీవ్ర చర్యలు తప్పవన్నారు. ఇరాన్‌లోని చమురు బావులు, విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు, ఇతర కీలక సౌకర్యాలను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటివరకు ఉద్దేశపూర్వకంగా వదిలేసిన మంచినీటి డీశాలినేషన్ ప్లాంట్లను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశాలున్నాయని సంకేతాలిచ్చారు. గత 47 ఏళ్ల ఇరాన్ పాలనలో మరణించిన అమెరికా సైనికులకు ప్రతీకారంగానే ఈ చర్యలు ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు.

ఒకవైపు చర్చల్లో పురోగతి ఉందని ట్రంప్ చెబుతున్నప్పటికీ, మరోవైపు అమెరికా ఆ ప్రాంతంలో అదనపు సైన్యాన్ని మోహరిస్తోంది. దీనిపై ఇరాన్ పార్లమెంట్ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చర్చల పేరుతో అమెరికా దండయాత్రకు సిద్ధమవుతోందని వారు ఆరోపించారు. అయితే, అమెరికాతో ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగడం లేదని ఇరాన్ నాయకులు ఖండించారు.

ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ సైనిక శక్తులు ఇటీవల నౌకాయానానికి దాదాపు మూసివేశాయి. గతంలో ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులను 10 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించగా, ఆ గడువు ఏప్రిల్ 6తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా హెచ్చరికలు ప్రపంచ చమురు మార్కెట్లపై, మధ్యప్రాచ్య భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి.
Donald Trump
Iran
Hormuz Strait
Kharg Island
oil wells
Middle East tensions
US military
Iran nuclear deal
oil market
de-salination plants

More Telugu News