Malaika Arora: కొత్త ప్రియుడితో ఆలయంలో మలైకా అరోరా.. ఎవరీ హర్ష్ మెహతా?

Malaika Arora Spotted with Harsh Mehta at Temple Visit
షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ నటి, ఫ్యాషన్ ఐకాన్ మలైకా అరోరా మరోసారి తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న చర్చతో వార్తల్లో నిలిచారు. నటుడు అర్జున్ కపూర్‌తో విడిపోయిన తర్వాత ఆమె కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్‌లో ఉన్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ, ఆదివారం ఆమె తన కొత్త ప్రియుడిగా భావిస్తున్న హర్ష్ మెహతాతో కలిసి రాజస్థాన్‌లోని ఆదినాథ్ జైన దేవాలయాన్ని సందర్శించారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆలయ సందర్శన కోసం మలైకా తెలుపు రంగు కుర్తా ధరించి చాలా నిరాడంబరంగా కనిపించగా, హర్ష్ నీలిరంగు షర్ట్‌లో ఉన్నారు. మొదట ఈ పర్యటనను రహస్యంగా ఉంచాలనుకున్నప్పటికీ, మలైకా రాక గురించి తెలియడంతో ఆమెను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు, స్థానికులు ఆలయానికి తరలివచ్చారు. దీంతో అక్కడ కాస్త గందరగోళం నెలకొంది. అక్కడికి వచ్చిన వారితో ఈ జంట సెల్ఫీలు దిగారు. జనం తాకిడి పెరగడంతో స్థానిక అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఎవరీ హర్ష్ మెహతా?
గత కొన్ని నెలలుగా మలైకాతో కనిపిస్తున్న ఈ హర్ష్ మెహతా ఎవరనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 33 ఏళ్ల హర్ష్ మెహతా వృత్తిరీత్యా ఒక డైమండ్ వ్యాపారి. వీరిద్దరిపై డేటింగ్ పుకార్లు గత ఏడాది అక్టోబర్‌లో ముంబైలో జరిగిన ఎన్రికే ఇగ్లేసియాస్ మ్యూజిక్ కాన్సర్ట్‌ జరిగినప్పటి నుంచి మొదలయ్యాయి. ఆ షోలో ఇద్దరూ కలిసి కనిపించి, మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు అక్కడి నుంచి వెళ్లిపోవడం కెమెరాలకు చిక్కడంతో వీరి మధ్య ఏదో ఉందనే ప్రచారం మొదలైంది.

నవంబర్ 26న ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రెండోసారి కనిపించడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. ఆ సమయంలో ఇద్దరూ కెమెరాలను తప్పించుకోవడానికి వేర్వేరుగా నడిచారు. మలైకా ముందు వెళ్లగా, ముఖానికి మాస్క్ ధరించిన హర్ష్ ఆమెను అనుసరించారు. చివరికి ఇద్దరూ ఒకే కారు ఎక్కి వెళ్లిపోవడంతో వారి సంబంధంపై వస్తున్న వార్తలు నిజమేనని చాలామంది భావించారు.

గతంలో మలైకా నటుడు అర్జున్ కపూర్‌తో 2018 నుంచి రిలేషన్‌షిప్‌లో ఉండి, 2024లో విడిపోయారు. అంతకుముందు నటుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్‌ను 1998లో వివాహం చేసుకుని, 2017లో విడాకులు తీసుకున్నారు. వీరికి అర్హాన్ ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే, తాజా డేటింగ్‌పై వస్తున్న వార్తలపై మలైకా గానీ, హర్ష్ గానీ ఇప్పటివరకు స్పందించలేదు.
Go Back to Shorts
Malaika Arora
Harsh Mehta
Malaika Arora dating
Adinath Jain Temple
Arjun Kapoor
Bollywood actress
Diamond merchant
Mumbai concert
Relationship rumors
Arbaaz Khan

More Telugu News