Indian Census: దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి జనగణన... 'సహజీవన జంటలకు' కూడా కుటుంబ హోదా
భారతదేశ జనాభా లెక్కల సేకరణలో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. 2021లో కోవిడ్ కారణంగా వాయిదా పడిన 16వ జనగణన ప్రక్రియ ఈ ఏడాది ఏప్రిల్ 1న ప్రారంభం కానుంది. ఈసారి జనాభా లెక్కల్లో మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలను సవరించారు. ఇందులో భాగంగా, చాలా కాలంగా కలిసి ఉంటున్న సహజీవన జంటలను ఇకపై 'కుటుంబం'గా గుర్తించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ ఈరోజు వివరాలను వెల్లడించారు.
రెండు దశల్లో జనగణన:
తొలి దశ (ఏప్రిల్ 1 నుంచి): ఈ దశలో 'గృహ గణన' (House Listing) చేపడతారు. అధికారులు మొబైల్ యాప్ ద్వారా ఇంటింటికీ వెళ్లి గృహాల వివరాలను సేకరిస్తారు.
రెండో దశ (వచ్చే ఏడాది ఫిబ్రవరి): ఈ దశలో అసలైన జనాభా లెక్కల సేకరణ (Population Enumeration) జరుగుతుంది.
జనగణన కోసం కేంద్రం ప్రత్యేకంగా 33 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని సిద్ధం చేసింది. ఇందులో కుటుంబ యజమాని వివరాలు, కులం, కమ్యూనిటీతో పాటు ఇంట్లోని వసతులపై ఆరా తీయనున్నారు. ఫోన్లు, ఇంటర్నెట్, వాహనాలు (సైకిల్ నుంచి కారు వరకు), టీవీ, రేడియో వంటి గృహోపకరణాలపై ప్రశ్నలు ఉంటాయి. తాగునీటి వనరులు, మరుగుదొడ్ల వినియోగం, వంటగది సౌకర్యాలు, వినియోగించే ఇంధనం మరియు తృణధాన్యాల వాడకం వంటి వివరాలను సేకరిస్తారు.
ఈసారి జనగణనలో మరో విశేషం ఏమిటంటే, పౌరులు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే (Self Enumeration) అవకాశాన్ని కేంద్రం కల్పించింది. దేశంలో సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి జనగణన జరుగుతుంది. చివరిసారిగా 2011లో జనాభా లెక్కలు సేకరించగా, దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న ఈ ప్రక్రియపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ గణాంకాలు భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల రూపకల్పనకు, నిధుల కేటాయింపులకు అత్యంత కీలకం కానున్నాయి.