Salman Khan: దిల్ రాజు, వంశీ పైడిపల్లితో సల్మాన్ ఖాన్ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన

బాలీవుడ్ సీనియ‌ర్ హీరో సల్మాన్ ఖాన్ తన అభిమానులకు ఒకేసారి రెండు శుభవార్తలు అందించారు. ఒకవైపు తన కొత్త సినిమాను ప్రకటిస్తూనే, మరోవైపు అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన తన తండ్రి సలీం ఖాన్ క్షేమంగా ఇంటికి చేరిన విషయాన్ని పంచుకున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు సల్మాన్ అధికారికంగా ప్రకటించారు.

ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. "ఈ ఏప్రిల్ నుంచి దిల్ రాజు, వంశీ పైడిపల్లిలతో కలిసి దిల్, దిమాగ్, జిగర్‌తో వస్తున్నా" అంటూ తన కొత్త సినిమాపై అప్‌డేట్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనప్పటికీ, ఇది ఒక భారీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పలు లొకేషన్లలో విస్తృతంగా షూటింగ్ జరపాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాను 2027 ఈద్ నాటికి విడుదల చేసే అవకాశాలున్నాయని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ 'మాతృభూమి' అనే యుద్ధ నేపథ్య చిత్రంలో నటిస్తున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిత్రాంగద సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఆయన ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'సికిందర్' చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు.

ఇక వ్యక్తిగత విషయానికొస్తే, ఈ నెల‌ 21న జరుపుకున్న ఈద్ పండుగ సందర్భంగా సల్మాన్ తన తండ్రి సలీం ఖాన్‌ను అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. కొద్ది రోజుల క్రితం ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన సలీం ఖాన్‌ను వీల్ చైర్‌లో తన గెలాక్సీ అపార్ట్‌మెంట్ బాల్కనీలోకి తీసుకువచ్చి, అభిమానులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. "ఈద్ ముబారక్. మీ ఆశీస్సులకు ధన్యవాదాలు. నాన్న ఇంటికి వచ్చేశారు" అని సల్మాన్ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా సల్మాన్ కుటుంబ సభ్యులందరూ ఆయన వెంట ఉన్నారు. రచయిత జావేద్ అక్తర్‌తో కలిసి సలీం-జావేద్ ద్వయంగా 'షోలే', 'దీవార్', 'జంజీర్', 'డాన్' వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సలీం ఖాన్ కథ అందించిన విషయం తెలిసిందే.
Salman Khan
Dil Raju
Vamshi Paidipally
Salman Khan new movie
Bollywood
Tollywood
Salim Khan
Sikandar movie
Eid 2027
Matrubhoomi movie

More Telugu News