Kavali Grishma: యువగళంలో లోకేశ్ మీసం మెలేస్తే... ప్రజలు బంపర్ మెజారిటీ ఇచ్చారు: కావలి గ్రీష్మ

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న పార్టీని స్థాపించి, తెలుగువారి కీర్తికి పునాది వేశారని ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ కొనియాడారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సభా నిర్వాహకురాలిగా వ్యవహరించిన గ్రీష్మ, పార్టీ ప్రస్థానాన్ని, నాయకుల దార్శనికతను గుర్తుచేశారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి, బడుగు బలహీన వర్గాలను అక్కున చేర్చుకుని ముందుకు నడిపించిన ఘనత తెలుగుదేశం పార్టీదని ఆమె కీర్తించారు.

2019-24 మధ్య కాలంలో గత వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు చేసిన పోరాటం, పడిన కష్టం వల్లే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గ్రీష్మ గుర్తుచేశారు. "సుపరిపాలనకు తొలి అడుగు, మన టీడీపీ, ఐటీడీపీ, బాబు షూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ" వంటి కార్యక్రమాలను కార్యకర్తలు తమ భుజాలపై వేసుకుని విజయవంతం చేశారని ప్రశంసించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన 19 మంది సామాన్య కార్యకర్తలను ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమానంగా వేదికపై కూర్చోబెట్టి గౌరవించిన ఏకైక పార్టీ టీడీపీ అని ఆమె పేర్కొన్నారు.

యువనేత, మంత్రి నారా లోకేశ్ నాయకత్వ పటిమపై గ్రీష్మ ప్రశంసల వర్షం కురిపించారు. లోకేశ్ తీసుకొచ్చిన నూతన విధానాలతో పార్టీ సభ్యత్వ నమోదు కోటి మార్కును దాటిందని తెలిపారు. "యువగళం పాదయాత్రలో లోకేశ్ మీసం మెలేస్తే 2024లో ప్రజలు బంపర్ మెజారిటీ ఇచ్చారు. ఆయన మన సమస్యలు విని, పరిష్కారం కోసం పోరాడే యోధుడు" అని అభివర్ణించారు. కార్యకర్తలకు జీవిత బీమా అందించి ధీమా కల్పించారని అన్నారు.

అదేవిధంగా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ 24 గంటలూ కార్యకర్తల కోసం ఆలోచిస్తూ, వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, బంపర్ మెజారిటీ సాధించినా గర్వం లేకుండా కార్యకర్తలా పనిచేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక దార్శనికుడని, రాష్ట్రాన్ని శూన్యం నుంచి శిఖరాలకు తీసుకెళ్లగల నాయకత్వ పటిమ ఆయన సొంతమని గ్రీష్మ అన్నారు. "పాలన అంటే కేవలం అధికారంలో ఉండటం కాదు, ప్రజల భవిష్యత్తును నిర్మించడం అని నిరూపించిన నాయకుడు చంద్రబాబు. నాయకత్వం అంటే మార్గం చూపించడం కాదు, మార్పు తీసుకురావడం అని చూపించారు. శ్రీవారి పాదాల చెంత ఉన్న నారావారిపల్లెలో పుట్టి, నేడు గ్లోబల్ స్థాయికి ఎదిగి 'సీబీఎన్' ఒక బ్రాండ్‌గా మారడం ఆయన నాయకత్వానికి నిదర్శనం" అని ఆమె ఉద్ఘాటించారు. ఇదే స్ఫూర్తితో పార్టీ శ్రేణులంతా కష్టపడి పనిచేస్తే 2029 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ధీమా వ్యక్తం చేశారు.
Kavali Grishma
Nara Lokesh
Chandrababu Naidu
TDP Formation Day
Telugu Desam Party
Andhra Pradesh Politics
Yuvagalam Padayatra
Palla Srinivas
AP Elections 2024

More Telugu News