KP Sharma Oli: నేపాల్ నూతన ప్రధాని బాలెన్ షా ప్రకంపనలు... మాజీ ప్రధాని ఓలీ అరెస్ట్

నేపాల్‌లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నూతన ప్రధాని బాలెన్ షా వచ్చీరావడంతోనే విపక్ష నేతలను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో మాజీ ప్రధాని, ప్రధాన ప్రతిపక్ష నేత కేపీ శర్మ ఓలీని పోలీసులు శనివారం ఉదయం అరెస్ట్ చేశారు. గతేడాది సెప్టెంబరులో జరిగిన 'జెన్-జీ' యువత ఉద్యమాన్ని అణచివేసిన ఘటనకు సంబంధించిన నరహత్య కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్‌తో రాజధాని ఖాట్మండూ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

ఓలీతో పాటు మాజీ హోంమంత్రి రమేశ్ లేఖక్‌ను కూడా భక్తపూర్ జిల్లాలోని వారి నివాసాల నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం ఓలీ అస్వస్థతకు గురికావడంతో, ఆయనను ఖాట్మండూలోని ఓ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓలీ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆయన నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూఎంఎల్) కార్యకర్తలు ఖాట్మండూలో ఆందోళనలు చేపట్టారు. పలుచోట్ల టైర్లు కాల్చి, విచారణ కమిషన్ నివేదిక ప్రతులను దహనం చేశారు. నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి.

శుక్రవారం కొలువుదీరిన ప్రధాని బాలేంద్ర షా నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం తన తొలి కేబినెట్ సమావేశంలోనే విచారణ కమిషన్ నివేదికను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ అరెస్టులు కక్షపూరితమైనవని, చట్టవిరుద్ధమని యూఎంఎల్ పార్టీ ఖండించింది. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో ఉన్నతస్థాయి విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.

ఇదిలా ఉండగా, ఓలీ అరెస్ట్‌ను నేపాల్ మాజీ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ 'అవివేక నిర్ణయం'గా అభివర్ణించారు. ఈ చర్య దీర్ఘకాలిక పరిణామాలకు దారితీయవచ్చని, దేశంలో అస్థిరత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సరైన అధ్యయనం, న్యాయ ప్రక్రియ లేకుండా నివేదికను అమలు చేయడం ప్రజాస్వామ్య విలువలకే విఘాతమని ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


KP Sharma Oli
Nepal
Balen Shah
Arrest
Prime Minister
Politics
Kathmandu
Communist Party of Nepal UML
Bidya Devi Bhandari
Ramesh Lekhak

More Telugu News