Balendra Shah: మోదీకి నేపాల్ కొత్త ప్రధాని బలేంద్ర షా ధన్యవాదాలు

నేపాల్ నూతన ప్రధానిగా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్‌పీ) అధినేత బలేంద్ర షా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలుపగా, ఇరు దేశాల మధ్య బహుముఖ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కలిసి పనిచేస్తానని షా ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాల పౌరుల ప్రయోజనాల కోసం మైత్రిని ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు సిద్ధంగా ఉన్నానని మోదీ పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలకు బలేంద్ర షా ధన్యవాదాలు తెలిపారు. "మీ ఆత్మీయ శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మన ప్రజల ఉమ్మడి శ్రేయస్సు కోసం ఇరు దేశాల మధ్య బహుముఖ సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు మీతో కలిసి పనిచేయడానికి నేను ఆసక్తిగా ఉన్నాను" అని నేపాల్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్‌ఎస్‌పీ మూడింట రెండొంతులకు పైగా మెజారిటీ సాధించడంతో ఆ పార్టీ పార్లమెంటరీ నేతగా ఎన్నికైన బలేంద్ర షాను నేపాల్ 47వ ప్రధానిగా అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ నియమించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 76(1) ప్రకారం ఈ నియామకం జరిగింది. 'బలేన్'గా ప్రసిద్ధి చెందిన 35 ఏళ్ల షా, నేపాల్ రాజకీయాల్లో అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానులలో ఒకరిగా నిలిచారు. ఇది నేపాల్ రాజకీయాల్లో తరం మార్పునకు సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రధాని అభ్యర్థిగా బలేంద్ర షాను ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగిన ఆర్‌ఎస్‌పీ, ఈ నెల‌ 5న జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. 275 స్థానాలున్న ప్రతినిధుల సభలో 182 సీట్లు కైవసం చేసుకుంది. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీపై తూర్పు నేపాల్‌లోని ఝాపా-5 స్థానం నుంచి పోటీ చేసిన షా, ఏకంగా 49,614 ఓట్ల భారీ తేడాతో గెలుపొందారు. 1991 తర్వాత నేపాల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ అభ్యర్థికీ ఇంత భారీ మెజారిటీ రాకపోవడం విశేషం.

1990లో ఖాట్మండులో జన్మించిన షా, 2022లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఖాట్మండు మేయర్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఖాట్మండులో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాక, భారత్‌లోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్సిటీ నుంచి స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఈ ఇంజినీరింగ్ నేపథ్యమే ఖాట్మండు మేయర్‌గా మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధిపై ఆయనకు పట్టు సాధించేందుకు దోహదపడింది.
Balendra Shah
Nepal Prime Minister
Narendra Modi
Nepal India relations
Rastriya Swatantra Party
Ram Chandra Paudel
Nepal Election 2024
Kathmandu Mayor
Nepal Politics
KP Sharma Oli

More Telugu News