Professor Gnanvel Babu: చెన్నై అన్నా యూనివర్సిటీలో కీచక ప్రొఫెసర్... విద్యార్థిని ఫిర్యాదుతో అరెస్ట్

తమిళనాడు రాజధాని చెన్నైలోని ప్రఖ్యాత అన్నా యూనివర్సిటీలో ఓ ప్రొఫెసర్ లైంగిక వేధింపుల ఆరోపణలపై అరెస్ట్ కావడం తీవ్ర కలకలం రేపింది. మూడేళ్లుగా తనను వేధిస్తున్నాడంటూ ఓ విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

వివరాల్లోకి వెళితే, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని, తన ప్రొఫెసర్ జ్ఞానవేల్ బాబుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండో సంవత్సరంలో ఉన్నప్పుడు ఇంటర్న్‌షిప్ సహాయం చేస్తాననే నెపంతో ప్రొఫెసర్ ఆమెను లైంగికంగా వేధించడం ప్రారంభించాడని బాధితురాలు ఆరోపించింది. అప్పటి నుంచి మూడేళ్లుగా ఫోన్ ద్వారా, వ్యక్తిగతంగా వేధిస్తున్నాడని, అశ్లీల సందేశాలు పంపడంతో పాటు అసభ్యంగా మాట్లాడేవాడని తన ఫిర్యాదులో పేర్కొంది. తాను ఫోన్‌లో బ్లాక్ చేసినా, స్నేహితుల ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించాడని తెలిపింది.

ఈ విషయం తెలియగానే శుక్రవారం విద్యార్థులు క్యాంపస్‌లో భారీ ఆందోళన చేపట్టారు. ప్రొఫెసర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై స్వతంత్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) నాయకులు మాట్లాడుతూ, బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. మార్కులు, అకడమిక్ కెరీర్‌పై ప్రభావం పడుతుందనే భయంతో ఫ్యాకల్టీపై ఫిర్యాదు చేయడానికి విద్యార్థినులు వెనుకాడుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రొఫెసర్ జ్ఞానవేల్ బాబును అరెస్ట్ చేశారు. యూనివర్సిటీ యాజమాన్యం కూడా అతడిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా, రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరిగాయని విపక్షాలు డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.


Professor Gnanvel Babu
Anna University
Student
Harassment
Arrest
Chennai

More Telugu News