రాజకీయాలకు బ్రేక్.. ఆటల బరిలోకి తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

నిత్యం రాజకీయాలు, ప్రజా సమస్యలతో బిజీగా ఉండే తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆటల బరిలోకి దిగనున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం 'లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్–2026' నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా ఈ క్రీడా పోటీలు జరగనున్నాయి.

ఈ విషయాన్ని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభలో అధికారికంగా ప్రకటించారు. ఈ క్రీడల నిర్వహణ కోసం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఛైర్మన్‌గా, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కో-ఛైర్మన్‌గా ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనసభ్యులకు ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య స్నేహపూర్వక వాతావరణం పెంపొందించడంతో పాటు రాష్ట్ర ప్రజల్లో క్రీడా స్ఫూర్తిని నింపడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తెలిపారు. క్రీడలతో పాటు రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఘనంగా ఏర్పాటు చేయనున్నారు.

ఈ పోటీల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా ఎమ్మెల్యే మకన్ సింగ్ రాజ్ ఠాకూర్‌తో పాటు మరో 13 మంది సభ్యులను నియమించారు. గురువారం నాడు కమిటీ సభ్యులు సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ నెల 28న మధ్యాహ్నం 3:30 గంటలకు ఎల్బీ స్టేడియంలో క్రీడలు ప్రారంభమవుతాయని కమిటీ స్పష్టం చేసింది. అంతకుముందు మంత్రులు, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి.. స్పీకర్‌ను కలిసి స్పోర్ట్స్ కిట్‌ను అందజేశారు.


More Telugu News