మొయినాబాద్ డ్రగ్స్ కేసులో వెలుగులోకి కొత్త వ్యక్తులు.. 15కి చేరిన నిందితుల సంఖ్య!

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ కాల్పులు, డ్రగ్స్ కేసు విచారణ ముందుకు సాగేకొద్దీ కొత్త కోణాలు, కీలక వ్యక్తుల పాత్రలు బయటపడుతున్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో భాగంగా ఈ కేసులో ఓ పెద్ద డ్రగ్స్ రాకెట్ నడుస్తున్నట్లు గుర్తించారు. నిందితులు వారాంతాల్లో ప్రముఖుల కోసం ప్రత్యేకంగా డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు తేలడంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 15కి చేరింది.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రోహిత్ రెడ్డితో పాటు, ఇటీవల అరెస్ట్ అయిన ప్రముఖ వైద్యుడు బాలాజీ, బాబీలోన్ పబ్ నిర్వాహకుడు అర్జున్‌రెడ్డి, ప్రియాంకరెడ్డి కలిసి ఈ వీకెండ్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నట్లు సిట్ విచారణలో వెల్లడైంది. రోహిత్ రెడ్డికి గత నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని, అప్పటి నుంచే ఈ పార్టీలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌తో పాటు జూబ్లీహిల్స్‌లో కూడా ఈ పార్టీలు నిర్వహించినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. అంతేకాకుండా, డాక్టర్ బాలాజీకి గోవాలోని డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని తేలడం కేసులో మరో కీలక పరిణామం. కొన్నిసార్లు రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ కూడా ఈ పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలింది.

మరోవైపు, ఈ కేసులో ప్రధాన నిందితులైన రోహిత్ రెడ్డి, నమిత్ శర్మ, రితీశ్ రెడ్డిల మూడు రోజుల పోలీస్ కస్టడీ గురువారంతో ముగిసింది. వారిని రాజేంద్రనగర్‌లోని 12వ మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచిన సిట్ అధికారులు, విచారణలో మరిన్ని అంశాలు రాబట్టాల్సి ఉందని, మరో ఐదు రోజులు కస్టడీ పొడిగించాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే, కస్టడీ పొడిగింపునకు న్యాయమూర్తి నిరాకరించారు. నిందితులకు ఏప్రిల్ 8 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో వారిని తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఈ కేసులో ఇప్పటికే డ్రగ్స్ సరఫరాదారులు అభిషేక్ సింగ్, రాకేష్ వర్మతో పాటు మరికొందరి పేర్లు బయటకు వచ్చాయి. సిట్ దర్యాప్తులో మరికొందరు ప్రముఖుల పేర్లు కూడా వెలుగులోకి వస్తున్నాయని, త్వరలోనే వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.


More Telugu News