ఈసారి ఓపెనింగ్ సెర్మనీ లేకుండానే ఐపీఎల్ పోటీలు...?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నూతన సీజన్ ప్రారంభానికి ముందు జరిగే అట్టహాసమైన ప్రారంభోత్సవ వేడుకలను బీసీసీఐ ఈసారి రద్దు చేస్తున్నట్లు తెలిసింది. గతేడాది బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో మరణించిన 11 మందికి నివాళిగా ఈ సున్నితమైన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది.

ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. సాధారణంగా సీజన్ ఓపెనింగ్ మ్యాచ్‌కు ముందు బాలీవుడ్ తారలు, ప్రముఖ గాయకులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే ఈసారి అలాంటి వేడుకలేవీ ఉండబోవని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి.

గత ఏడాది జూన్ 4న జరిగిన దురదృష్టకర సంఘటన దృష్ట్యా, మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ ఈసారి ఎలాంటి అధికారిక వేడుకలు, వినోద కార్యక్రమాలు నిర్వహించడం లేదు" అని సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాది (2025) ఆర్‌సీబీ తొలిసారిగా టైటిల్ గెలుచుకున్న సందర్భంగా బెంగళూరులో నిర్వహించిన విజయోత్సవాల్లో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

అయితే, టోర్నీ ముగింపు రోజైన మే 31న మాత్రం ఘనంగా వేడుకలు నిర్వహించాలని బీసీసీఐ, ఐపీఎల్ పాలకమండలి భావిస్తున్నట్లు సమాచారం. 


More Telugu News