ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... రెండో విడత షెడ్యూల్ విడుదల

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు సంబంధించి రెండో దశ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం అధికారికంగా ప్రకటించింది. లీగ్ దశలో మిగిలిన 50 మ్యాచ్‌ల పూర్తి వివరాలను వెల్లడించింది. ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా మొత్తం 12 వేదికల్లో ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

రెండో దశ షెడ్యూల్‌లో భాగంగా తొలి మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనుండటం తెలుగు రాష్ట్రాల అభిమానులకు ఉత్సాహాన్నిస్తోంది. ఏప్రిల్ 13న జరిగే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్టు, రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌తో రెండో అంకానికి తెరలేవనుండగా, ప్లేఆఫ్స్ బెర్తుల కోసం జట్ల మధ్య అసలైన పోటీ ఇక్కడి నుంచే ప్రారంభం కానుంది. బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, లక్నో, జైపూర్, ధర్మశాల, రాయ్‌పూర్, న్యూ చండీగఢ్‌ నగరాలు ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

ఈ రెండో దశలో మొత్తం ఎనిమిది డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉంటాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3:30 గంటలకు, సాయంత్రం మ్యాచ్‌లు 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. కొన్ని జట్లకు రెండేసి నగరాలను హోమ్ గ్రౌండ్‌లుగా కేటాయించడం ఈ షెడ్యూల్‌లో మరో విశేషం. పంజాబ్ కింగ్స్ జట్టు తమ హోమ్ మ్యాచ్‌లను న్యూ చండీగఢ్‌తో పాటు ధర్మశాలలో ఆడనుంది. ధర్మశాలలో మూడు మ్యాచ్‌లు ఆడుతుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ తమ నాలుగు హోమ్ మ్యాచ్‌లను జైపూర్‌లో ఆడనుండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు మూడు మ్యాచ్‌లను బెంగళూరులో, మరో రెండు హోమ్ మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లో ఆడనుంది.

లీగ్ దశ ముగిశాక జరిగే ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల వేదికలను మాత్రం బీసీసీఐ ఇంకా ఖరారు చేయలేదు. లీగ్ దశ చివరి వారాల్లో జట్ల మధ్య పోటీ తీవ్రమయ్యే కొద్దీ, ప్లేఆఫ్స్ వేదికలపై స్పష్టత ఇస్తామని తెలిపింది. దీంతో ఐపీఎల్ లీగ్ దశ సంబరానికి పూర్తి షెడ్యూల్ ఖరారైనట్లయింది.

కాగా, ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తొలి విడత షెడ్యూల్ ను కొన్నిరోజుల కిందటే విడుదల చేశారు. ఇందులో ఏప్రిల్ 12 వరకు మ్యాచ్ ల షెడ్యూల్ ను ప్రకటించారు. 



More Telugu News