అమరావతిపై అసెంబ్లీలో తీర్మానం అనేది చంద్రబాబు ఆడుతున్న డ్రామా: సజ్జల
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తుండటాన్ని వైసీపీ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ పరిణామాలపై ఆ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో తీర్మానం చేయడం అనేది కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి చంద్రబాబు ఆడుతున్న 'డ్రామా' అని ఆయన అభివర్ణించారు.
కేవలం అసెంబ్లీని మాత్రమే ఎందుకు సమావేశపరుస్తున్నారని, మండలిని ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు. రాజధానిని ఒక 'శాశ్వత కామధేనువు'గా మార్చుకుని చంద్రబాబు అక్కడ అవినీతి యజ్ఞం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో టెండర్లు ఖరారైన పనులకు మళ్లీ కొత్తగా టెండర్లు పిలవడం, డిజైన్ల పేరుతో రూ. 400 కోట్లు ఖర్చు చేయడం వెనుక పెద్ద గూడుపుఠాణి ఉందని ఆరోపించారు. జగన్ గారు ఎప్పుడూ అమరావతికి వ్యతిరేకం కాదని, అందుకే అధికారంలోకి రాకముందే అక్కడ ఇల్లు కట్టుకున్నారని గుర్తు చేశారు. తాము ప్రశ్నిస్తోంది కేవలం అక్కడ జరుగుతున్న దోపిడీ, పారదర్శకత లేని పనుల గురించేనని అన్నారు.
రాజధాని కనెక్టివిటీ కోసం వెస్ట్ బైపాస్ వంటి పనులను వైసీపీ హయాంలోనే పూర్తి చేశామని, కానీ ఇప్పుడు చంద్రబాబు కేవలం అప్పులు తెచ్చి మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల రూపంలో కమీషన్లు కొట్టేస్తున్నారని ఆరోపించారు. రైతులకు ఇచ్చిన ప్లాట్లను అభివృద్ధి చేయకుండా, కేవలం తన సొంత ఇంటి నిర్మాణాన్ని మాత్రమే జోరుగా సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి పేరుతో రాష్ట్ర భవిష్యత్తును చీకట్లోకి నెడుతున్నారని, ప్రజల సొమ్మును పీల్చి పిప్పి చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.