ఐపీఎల్-2026లో సత్తా చాటేందుకు ఉరకలేస్తున్న 4 కొత్త ముఖాలు!

2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కేవలం ఒక క్రికెట్ టోర్నమెంట్‌గా మిగిలిపోలేదు. ప్రతిభ, పట్టుదల, అవకాశం కలిసే ఒక అద్భుతమైన వేదికగా ఇది రూపాంతరం చెందింది. ఐపీఎల్ ట్రోఫీపై సంస్కృతంలో "యత్ర ప్రతిభ అవసర ప్రాప్నోతిహి" అని రాసి ఉంటుంది. దీని అర్థం "ప్రతిభకు అవకాశం లభించే చోటు" అని. ఈ నినాదానికి తగ్గట్టుగానే ప్రతీ సీజన్‌లో ఎందరో యువ ఆటగాళ్లు వెలుగులోకి వస్తుంటారు. 

దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి, ఐపీఎల్ 2026లో అరంగేట్రం చేయబోతున్న కొందరు అన్‌క్యాప్డ్ (ఇంకా జాతీయ జట్టుకు ఆడని) ఆటగాళ్లపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. తమకు లభించిన అవకాశాన్ని అందిపుచ్చుకుని, స్టార్‌లుగా ఎదిగేందుకు ఈ యువ కెరటాలు సిద్ధంగా ఉన్నాయి.

అకిబ్ నబీ దార్ (ఢిల్లీ క్యాపిటల్స్)
జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఈ స్వింగ్ బౌలర్, తన అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో పాటు బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా రంజీ ట్రోఫీలో గత రెండు సీజన్లలో అతని ప్రదర్శన అమోఘం. 2024-25, 2025-26 సీజన్లలో కలిపి ఏకంగా 104 వికెట్లు పడగొట్టాడు. 

2025-26 రంజీ సీజన్‌లో అయితే 17 ఇన్నింగ్స్‌లలో కేవలం 12.65 సగటుతో 60 వికెట్లు తీసి, సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. జమ్మూ కశ్మీర్ జట్టు తొలిసారి చారిత్రక రంజీ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును కూడా అందుకున్నాడు. అతని ప్రతిభను గుర్తించిన ఢిల్లీ క్యాపిటల్స్, వేలంలో ఏకంగా రూ. 8.40 కోట్లు వెచ్చించి అతడిని కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో ఇదే అతనికి తొలి అవకాశం.

కార్తీక్ శర్మ (చెన్నై సూపర్ కింగ్స్)
రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్, భారీ సిక్సర్లకు పెట్టింది పేరు. దేశవాళీ క్రికెట్‌లో సిక్సర్ల మోత మోగించడంతో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) దృష్టిని ఆకర్షించాడు. ఫలితంగా, ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ భారత ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. సీఎస్‌కే అతడి కోసం రూ. 14.2 కోట్లు ఖర్చు చేసింది. 

2025-26 రంజీ సీజన్ తొలి దశలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో ఒకడిగా, 2024-25 విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గత ఐపీఎల్ సీజన్‌లో సీఎస్‌కే జట్టుతో కలిసి శిక్షణ పొందిన కార్తీక్, ఈసారి ప్రధాన జట్టులో చోటు దక్కించుకున్నాడు.

ప్రశాంత్ వీర్ (చెన్నై సూపర్ కింగ్స్)
లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా రాణిస్తూనే, లోయర్ ఆర్డర్‌లో భారీ సిక్సర్లు బాదగల సత్తా ఉన్న ఆటగాడు ప్రశాంత్ వీర్. ఐపీఎల్ 2026 వేలంలో ఇతను సంచలనం సృష్టించాడు. కార్తీక్ శర్మతో పాటు అత్యధిక ధర (రూ. 14.2 కోట్లు) పలికిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు. చెన్నైలో జరిగిన ట్రయల్స్‌లో, బీసీసీఐ అండర్-23 టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణించడంతో సీఎస్‌కే ఫ్రాంచైజీ దృష్టిలో పడ్డాడు. 

ఐపీఎల్ 2026కి ముందు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్‌కు ట్రేడ్ అవ్వడంతో, అతని స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ప్రశాంత్‌లో ఉందని సీఎస్‌కే భావిస్తోంది. యూపీ టీ20 లీగ్‌లో 155 స్ట్రైక్ రేట్‌తో 320 పరుగులు చేయడంతో పాటు 8 వికెట్లు కూడా పడగొట్టి తన ఆల్‌రౌండ్ ప్రతిభను నిరూపించుకున్నాడు.

మంగేష్ యాదవ్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
మధ్యప్రదేశ్ టీ20 లీగ్‌లో 6 మ్యాచ్‌లలో 12.00 సగటుతో 14 వికెట్లు తీసి మంగేష్ యాదవ్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌తో కలిసి మధ్యప్రదేశ్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడిన అనుభవం అతనికి ఉంది. యశ్ దయాల్ స్థానంలో సరైన ప్రత్యామ్నాయంగా భావించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అతనికి జట్టులో అవకాశం కల్పించింది. బౌలింగ్‌తో పాటు, అవసరమైనప్పుడు బ్యాట్‌తోనూ రాణించగల సత్తా మంగేష్‌కు ఉంది. 

దేశవాళీ క్రికెట్‌లో అతనికి ఎక్కువ అనుభవం లేనప్పటికీ, ఆర్‌సీబీ స్కౌటింగ్ నెట్‌వర్క్ అతని సామర్థ్యంపై పూర్తి నమ్మకంతో ఉంది. ఈ యువ ఆటగాళ్లు ఐపీఎల్ వంటి పెద్ద వేదికపై ఎలా రాణిస్తారో చూడాలని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




More Telugu News