పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్.. నిలిచిన బాస్మతి రైస్ ఎగుమతులు

పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత బాస్మతీ రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏటా దేశానికి భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెట్టే సుమారు రూ.50 వేల కోట్ల విలువైన ఈ పరిశ్రమ, ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది.

యుద్ధం కారణంగా పశ్చిమాసియాకు వెళ్లే సముద్ర మార్గాలు అత్యంత ప్రమాదకరంగా మారడంతో ఎగుమతులు దాదాపుగా నిలిచిపోయాయి. దీంతో సుమారు 10 లక్షల టన్నుల బాస్మతీ బియ్యం భారత ఓడరేవుల్లోనే పేరుకుపోయింది. దీనికి తోడు, షిప్పింగ్ కంపెనీలు ‘వార్-రిస్క్ సర్ ఛార్జ్’ పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేస్తుండటంతో రవాణా ఖర్చులు రెట్టింపయ్యాయి. ఇది ఎగుమతిదారులపై పెను భారంగా మారింది.

మరోవైపు, ఇప్పటికే ఎగుమతి చేసిన సరుకులకు సంబంధించి చెల్లింపులు కూడా ఆగిపోయాయి. ఇరాన్ వంటి దేశాల నుంచి రూ.2,000 కోట్ల నుంచి రూ.25,000 కోట్ల వరకు బకాయిలు నిలిచిపోయినట్లు అంచనా. అక్కడి బ్యాంకింగ్ వ్యవస్థలు సరిగ్గా పనిచేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ పరిణామాల ప్రభావంతో దేశీయ మార్కెట్లలో బాస్మతీ ధర క్వింటాల్‌కు రూ.800 వరకు పడిపోయింది. ఇది పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రైతులను ఆర్థికంగా దెబ్బతీస్తోంది.

భారత్ నుంచి ఎగుమతయ్యే మొత్తం బాస్మతీలో శాతం 70-75  సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, యూఏఈ వంటి దేశాలకే వెళ్తుంది. ఈ అనిశ్చితి ఇలాగే కొనసాగితే, భారత మార్కెట్‌ను పాకిస్థాన్ వంటి పోటీ దేశాలు కైవసం చేసుకునే ప్రమాదం ఉందని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News