రాహుల్ కంటే ప్రియాంక బెటర్.. విపక్ష నేతపై కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు

లోక్‌సభలో విపక్ష నేతగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కంటే ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా మెరుగైన ఎంపిక అయి ఉండేవారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి ఇంకా రాజకీయ పరిణతి రాలేదని ఆయన విమర్శించారు. గురువారం ఢిల్లీలో జరిగిన ‘టైమ్స్ నౌ సమ్మిట్ 2026’లో మాట్లాడుతూ రిజిజు ఈ వ్యాఖ్యలు చేశారు.

లోక్‌సభలో రాహుల్ గాంధీ వ్యవహరించే తీరు, అంశాలను లేవనెత్తే విధానంలో విపక్ష నేతకు ఉండాల్సిన గంభీరత కనిపించడం లేదని రిజిజు అన్నారు. ‘‘రాహుల్ గాంధీలో రాజకీయ పరిపక్వత లోపించిందని నేను భావిస్తున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడమే కాకుండా, నిర్మాణాత్మక సూచనలు ఇవ్వడంలో విపక్ష నేత పాత్ర కీలకమని, కానీ రాహుల్ గాంధీలో అది కొరవడిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

రాహుల్‌తో పోలిస్తే ప్రియాంక గాంధీకి రాజకీయాలపై మంచి అవగాహన ఉందని, ప్రజలతో కలిసిపోయే నైపుణ్యం ఆమెకు ఎక్కువగా ఉందని రిజిజు అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఆమె విపక్ష నేతగా ఉండి ఉంటే, సభలో చర్చలు మరింత అర్థవంతంగా సాగి ఉండేవని అన్నారు. అయితే, రిజిజు వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహం ఉందని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రాహుల్ గాంధీ ఇమేజ్‌ను దెబ్బతీయడంతో పాటు, గాంధీ కుటుంబంలో విభేదాలు సృష్టించేందుకే బీజేపీ నేతలు ఉద్దేశపూర్వకంగా ప్రియాంక పేరును తెరపైకి తెస్తున్నారని విమర్శిస్తున్నాయి. మొత్తంగా, విపక్ష నేత విషయంలో రిజిజు చేసిన ఈ పోలిక జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.


More Telugu News