విడాకులు తీసుకోబోతున్నట్టు వస్తున్న వార్తలపై ప్రియాంక చోప్రా స్పందన!
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, తన వైవాహిక జీవితంపై సాగుతున్న నెగటివ్ ప్రచారానికి ముగింపు పలికారు. నిక్ జోనాస్‌తో ఆమె విడిపోతున్నారంటూ వస్తున్న వార్తలను ఆమె కొట్టిపడేశారు. ఈ వార్తలు కేవలం కల్పితమని... దేశం, మతం, వయసు వంటి అంశాలను సాకుగా చూపి కొందరు విషప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
కేవలం ఆరు నెలల పరిచయంతోనే పెళ్లి చేసుకున్నప్పటికీ, తమ మధ్య ఉన్న గౌరవం, నిక్ చూపే నిజాయతీ ఈ ఎనిమిదేళ్ల ప్రయాణాన్ని ఎంతో మధురంగా మార్చాయని ప్రియాంక తెలిపారు. బయటి వ్యక్తుల అభిప్రాయాలు తమ బంధాన్ని ప్రభావితం చేయవని తేల్చి చెప్పారు. తన కుమార్తె మాల్తీ మేరీ ప్రైవసీ విషయంలో తాను చాలా కఠినంగా ఉంటానని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ఫొటోలు తీయడం, సోషల్ మీడియాలో వైరల్ చేయడం వంటివి తనకు నచ్చవని, అందుకే తన బిడ్డ భద్రత కోసం ప్రత్యేక సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నట్లు వివరించారు.
30 ఏళ్ల వయసులో బాలీవుడ్‌లో టాప్ పొజిషన్‌లో ఉండి కూడా, అన్నీ వదిలేసి హాలీవుడ్‌లో సున్నా నుంచి మొదలుపెట్టడం ఒక పెద్ద సాహసమని ఆమె గుర్తు చేసుకున్నారు. మొదట్లో చిన్న పాత్రలే వచ్చినప్పటికీ, పట్టుదలతో ముందుకు సాగానని... ఇప్పుడు తనకు నచ్చిన ప్రాజెక్టులను ఎంచుకునే స్థాయికి చేరుకున్నానని గర్వంగా చెప్పారు.