కవిత కొత్త పార్టీ.. శ్రీరామనవమి నాడు అధికారిక ప్రకటన!

తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించడానికి రంగం సిద్ధమైంది. బీఆర్ఎస్ పార్టీకి దూరమైన తర్వాత కొంతకాలంగా ప్రజా సమస్యలపై గళం విప్పుతున్న కల్వకుంట్ల కవిత, తన కొత్త పార్టీని ప్రకటించేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పవిత్రమైన శ్రీరామనవమి పర్వదినం రోజున, అంటే ఈ నెల‌ 27వ తేదీన తన రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు ఉదయం 8 గంటలకు ఈ ప్రకటన వెలువడుతుందని ఆమె సన్నిహిత వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు కవిత ఇప్పటికే స్పష్టతనిచ్చారు. ఈ పేరుతో పార్టీ నమోదు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్న ఆమె, ప్రక్రియను వేగవంతం చేయాలని ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ప్రస్తుతం పార్టీ నమోదు ప్రక్రియ చివరి దశకు చేరుకోవడంతో ఇక అధికారికంగా పార్టీని ప్రకటించాలని కవిత నిర్ణయించుకున్నట్లు సమాచారం. తన మెట్టినిల్లు అయిన సిద్దిపేట నుంచే కవిత తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించే అవకాశాలున్నాయి. పార్టీ జెండా, గుర్తు, సిద్ధాంతాలు, విధివిధానాలను సిద్దిపేట నుంచే ప్రకటించవచ్చని భావిస్తున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సిద్దిపేట నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని గతంలో ఓ ఇంటర్వ్యూలో కవిత తన మనసులోని మాటను వెల్లడించారు. ఈ నేపథ్యంలో పార్టీ ప్రకటన రోజునే, తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గాంధీజీ సర్వోదయ సిద్ధాంతం స్ఫూర్తితో ‘సామాజిక తెలంగాణ’ సాధించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని కవిత పలుమార్లు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉద్యమకారులకు, యువతకు తన పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని ఆమె హామీ ఇస్తున్నారు. ఈ కొత్త పార్టీ ఆవిర్భావంతో తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


More Telugu News