Jaishankar: పాకిస్థాన్ మాదిరి భారతదేశం 'దళారీగా వ్యవహరించదు': అఖిలపక్ష సమావేశంలో జైశంకర్ కీలక వ్యాఖ్య

Jaishankar says India is not a broker like Pakistan
షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్ మాదిరిగా భారతదేశం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. గత కొద్దిరోజులుగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరాన్‌పై ఐదు రోజుల పాటు దాడులను ఆపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. చర్చల అనంతరం తదుపరి నిర్ణయం ఉంటుందని రెండు రోజుల క్రితం వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది.

"పాకిస్థాన్ మాదిరి భారతదేశం దళారీగా వ్యవహరించదు" అని జైశంకర్ అఖిలపక్ష సమావేశంలో వ్యాఖ్యానించారని సంబంధిత నాయకులను ఉద్దేశిస్తూ పీటీఐ తన కథనంలో పేర్కొంది.

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి పాకిస్థాన్, టర్కీ సహా పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో జైశంకర్ పైవ్యాఖ్యలు చేశారు.

1981 నుంచి అమెరికా పాకిస్థాన్‌ను ఉపయోగించుకుంటోందని, ఈ క్రమంలో మధ్యవర్తిత్వం అంశం కొత్తేమీ కాదని అన్నట్లు ఆ కథనంలో పేర్కొంది. పశ్చిమాసియా సంక్షోభంపై మాట్లాడేందుకు పార్లమెంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో 'మనది దలాల్ దేశం కాదు' అని వ్యాఖ్యానించారని తెలుస్తోంది.

ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతోందని, దీనికి త్వరగా ముగింపు పలకాలని తనకు ఫోన్ చేసిన ట్రంప్‌కు ప్రధాని మోదీ స్పష్టం చేశారని ఈ సమావేశంలో తెలిపారు.

పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ఢిల్లీ మౌనంగా ఉంటోందన్న ప్రతిపక్షాల ఆరోపణలపై కూడా ఆయన స్పందించారు. ఈ అంశంపై మనం ఎప్పటికప్పుడు స్పందిస్తున్నామని తెలియజేశారు. ఖమేనీ మృతిపై ఆలస్యంగా స్పందించారన్న వార్తలను కూడా జైశంకర్ కొట్టిపారేశారు. ఇరాన్ రాయబార కార్యాలయం తెరవగానే విదేశాంగ కార్యదర్శి పర్యటించి సంతాప సందేశం రాశారని గుర్తు చేశారు.

గల్ఫ్ ప్రాంతాల్లోని భారతీయుల భద్రత, దేశీయ ఇంధన భద్రత తమ ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ అఖిల పక్ష సమావేశంలో ప్రభుత్వం స్పష్టం చేసిందని పీటీఐ కథనం పేర్కొంది.

ఈ వ్యవహారంలో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం పాత్ర పోషిస్తుంటే మనం మూగ ప్రేక్షకులుగా మిగిలిపోయామని కాంగ్రెస్ ఎంపీ తారిఖ్ అన్వర్ విమర్శించారు. ఈ అంశంపై రాజ్యసభలో చర్చించాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Jaishankar
S Jaishankar
India Iran
India US relations
Pakistan mediation
West Asia crisis
Middle East tensions

More Telugu News