Supreme Court: 'వందేమాతరం' పాడటం తప్పనిసరి కాదు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court on Vande Mataram Singing Not Mandatory
షార్ట్స్‌లో చూడండి
ప్రభుత్వ, అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గేయం 'వందేమాతరం' పాడాలంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ సర్క్యులర్ కేవలం సలహా పూర్వకమైనదే తప్ప, తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. అందులో ఎలాంటి శిక్షార్హమైన చర్యలు పేర్కొననందున, ఈ పిటిషన్‌పై విచారణ తొందరపాటు అవుతుందని అభిప్రాయపడింది.

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం. పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈ ఏడాది జనవరి 28న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ కేవలం సలహా మాత్రమేనని, దాన్ని పాటించకపోతే శిక్షలు ఉంటాయని ఎక్కడా చెప్పలేదని ధర్మాసనం పేర్కొంది. "ఒకవేళ శిక్షార్హమైన చర్యలు తీసుకుంటే లేదా దీన్ని తప్పనిసరి చేస్తే అప్పుడు విచారిస్తాం. ప్రస్తుతానికి ఇందులో అలాంటివేమీ లేవు" అని కోర్టు వ్యాఖ్యానించింది.

పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే, సర్క్యులర్‌లో శిక్షలు లేకపోయినా ఇది పరోక్ష ఒత్తిడికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వందేమాతరం పాడటానికి లేదా గౌరవ సూచకంగా నిలబడటానికి నిరాకరించే వారు సామాజిక వివక్షను ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆయన వాదించారు. "దేశభక్తిని బలవంతంగా రుద్దలేరు. వ్యక్తిగత అంతరాత్మను కాపాడాల్సిన బాధ్యత రాజ్యాంగంపై ఉంది" అని ఆయన నివేదించారు.

అయితే, పిటిషనర్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలు ప్రస్తుతానికి ఊహాజనితమేనని ధర్మాసనం అభిప్రాయపడింది. ఒకవేళ ఎవరిపైనైనా శిక్షార్హమైన చర్యలు తీసుకున్నా లేదా వివక్ష చూపినా, అప్పుడు మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని సూచిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. విద్యాసంస్థలు, బహిరంగ సభల్లో వందేమాతరం పాడాలని కేంద్రం సర్క్యులర్‌లో సూచించింది. ఇది కేవలం జాతీయ గేయంపై గౌరవాన్ని పెంపొందించడానికేనని, చట్టబద్ధంగా అమలు చేయాలనే ఉద్దేశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

వందేమాతరం స్ఫూర్తి గురించి ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రస్తావించడం గమనార్హం. బంకించంద్ర చటోపాధ్యాయ 1875లో రచించిన ఈ గేయం, స్వాతంత్ర్య పోరాటంలో ప్రజలను ఏకతాటిపై నడిపించిందని కొనియాడారు. రవీంద్రనాథ్ ఠాగూర్ స్వరపరిచిన ఈ గీతాన్ని 1896లో కాంగ్రెస్ సమావేశంలో తొలిసారి ఆలపించారు. 1950లో అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ దీనికి జాతీయ గేయం హోదా కల్పించారు.
Go Back to Shorts
Supreme Court
Vande Mataram
National Anthem
Suryakanth CJI
Sanjay Hegde
Central Government Circular
Patriotism
Constitution
Rajendra Prasad
Narendra Modi

More Telugu News