Kunamneni Sambasiva Rao: హైదరాబాద్‌పై ఒక్క బాంబు పడితే చాలు.. అసెంబ్లీలో కూనంనేని సంచలన వ్యాఖ్యలు

Kunamneni Sambasiva Rao Comments on Hyderabad Bomb Threat in Assembly
షార్ట్స్‌లో చూడండి
అభివృద్ధి అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమైందని, దానిని అన్ని జిల్లా కేంద్రాలకు విస్తరించాలని సీపీఐ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు. "ఇప్పుడు యుద్ధాల కాలం నడుస్తోంది. ఎవరైనా హైదరాబాద్‌పై ఒక్క బాంబు వేస్తే నగరం మొత్తం నాశనమవుతుంది" అని ఆయన అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

హైదరాబాద్‌లో ఐటీ రంగంపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని కూనంనేని ఆరోపించారు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని, కంపెనీలు వారి రక్తం పీలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, సింగరేణి, ఆర్టీసీలను ప్రైవేటుపరం చేసే ఆలోచన కనిపిస్తోందని అన్నారు. సింగరేణిలో బొగ్గు సేకరణ, ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను ప్రైవేటుకు అప్పగిస్తున్నారని విమర్శించారు.

గతంలో జలయజ్ఞం పేరుతో ప్రారంభమైన నీటిపారుదల ప్రాజెక్టులు పాలకులకు ఏటీఎంలుగా మారాయని కూనంనేని అన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తి కావాలంటే రూ. 2 లక్షల కోట్లు అవసరం కాగా, బడ్జెట్‌లో కేవలం రూ. 22,966 కోట్లు మాత్రమే కేటాయించారని గుర్తుచేశారు.

ఇదే చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు మేలు చేసేదని, దానిపై విమర్శలు చేయవద్దని కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాలన్నీ ఆచరణ సాధ్యమేనని విశ్వాసం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Kunamneni Sambasiva Rao
Hyderabad
Telangana Assembly
CPI
Budget Session
War threat
Development
IT sector
Singareni
RTC

More Telugu News