Andre Russell: ఆండ్రీ రస్సెల్‌కు కేకేఆర్ అరుదైన గౌరవం.. జెర్సీ నంబర్ 12కు వీడ్కోలు

Andre Russell KKR Jersey Number 12 Retired Honoring Star All Rounder
షార్ట్స్‌లో చూడండి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తమ స్టార్ ఆల్‌రౌండర్, 'ఎటర్నల్ నైట్'గా పిలుచుకునే ఆండ్రీ రస్సెల్‌కు అరుదైన గౌరవాన్ని అందించింది. జట్టుకు అతడు అందించిన అద్భుతమైన సేవలకు గుర్తుగా రస్సెల్ ధరించిన 12వ నంబర్ జెర్సీని శాశ్వతంగా రిటైర్ చేస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం సాయంత్రం జరిగిన 'నైట్స్ అన్‌ప్లగ్డ్ 3.0' అనే ప్రీ-సీజన్ ఈవెంట్‌లో మూడుసార్లు ఛాంపియన్ అయిన కేకేఆర్ ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది.

వెస్టిండీస్‌కు చెందిన ఈ దిగ్గజ ఆల్‌రౌండర్ 2014 నుంచి 2025 వరకు 12 ఏళ్ల పాటు కేకేఆర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. తన విధ్వంసకర బ్యాటింగ్, బౌలింగ్‌తో జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ముఖ్యంగా, 2014, 2024లలో కేకేఆర్ ఐపీఎల్ టైటిళ్లు గెలవడంలో రస్సెల్ కీలక పాత్ర పోషించారు. ఆటగాడిగా వీడ్కోలు పలికిన రస్సెల్ ప్రస్తుతం జట్టుకు 'పవర్ కోచ్'‌గా కొత్త బాధ్యతలు చేపట్టాడు. కేకేఆర్ తరఫున 140 మ్యాచ్‌లు ఆడిన రస్సెల్ 174.17 స్ట్రైక్ రేట్‌తో 2,651 పరుగులు చేసి, 123 వికెట్లు పడగొట్టాడు.

ఈ సందర్భంగా కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ మాట్లాడుతూ.. "రస్సెల్‌తో మాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన మాకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. 12వ నంబర్ జెర్సీ రస్సెల్‌కు చాలా ప్రత్యేకం. అందుకే ఆయన గౌరవార్థం ఈ నంబర్‌ను రిటైర్ చేస్తున్నాం" అని తెలిపారు.

ఈ గౌరవం పట్ల రస్సెల్ భావోద్వేగానికి గురయ్యాడు. "ఈ ఫ్రాంచైజీతో దశాబ్దానికి పైగా నా ప్రయాణం అద్భుతంగా సాగింది. రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టులో భాగమవడం గొప్ప అనుభూతి. ఈ ప్రయాణాన్ని ప్రత్యేకంగా నిలిపిన కేకేఆర్ యాజమాన్యానికి ధన్యవాదాలు" అని పేర్కొన్నాడు.
Go Back to Shorts
Andre Russell
KKR
Kolkata Knight Riders
IPL
Indian Premier League
Jersey Retirement
Cricket
Venkky Mysore
Power Coach
West Indies

More Telugu News