Nara Lokesh: ఇది తెలుగుదేశం పార్టీ 3.0 వెర్షన్.. మధ్యవర్తులు ఉండరు: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh TDP 30 Version Without Intermediaries
షార్ట్స్‌లో చూడండి
"ఇది తెలుగుదేశం పార్టీ 3.0 వర్షన్. పార్టీలో సమూల మార్పులు తీసుకువచ్చి, మరింత బలంగా ముందుకు వెళతాం" అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే కార్యకర్తలను మధ్యవర్తులు లేకుండా నేరుగా గుర్తించడమే తమ లక్ష్యమని ఆయన ప్రకటించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ ఇంఛార్జ్‌ల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల్లో భాగంగా ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు.

తెలుగుదేశం పార్టీని ఒక యూనివర్సిటీతో పోల్చిన లోకేశ్, ఎంతోమంది గొప్ప నాయకులను తయారుచేసిన కార్ఖానా అని అభివర్ణించారు. "తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, రెండో ముఖ్యమంత్రి కూడా మన తెలుగుదేశం యూనివర్సిటీ నుంచి వచ్చినవారే. గతంలో గండిపేటలో నిరంతరం శిక్షణా తరగతులు జరిగేవి. వాటి ద్వారా ఎంతోమంది ఉపముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఎదిగారు. ఇప్పుడు ఏడాదికి కనీసం 300 రోజులు శిక్షణా తరగతులు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం" అని వివరించారు. పదవులు ఇస్తున్నప్పటికీ, వారి బాధ్యతలేమిటో స్పష్టంగా చెప్పలేకపోతున్నామని, ఈ శిక్షణ ద్వారా ఆ లోటును భర్తీ చేస్తామని తెలిపారు.

అహంకారం వద్దు.. ప్రజలు గమనిస్తున్నారు
2024 ఎన్నికల్లో కూటమి సాధించిన చారిత్రక విజయాన్ని లోకేశ్ గుర్తుచేశారు. "2019 నుంచి 2024 మధ్య మనపై ఎన్నో దాడులు జరిగాయి. అక్రమ కేసులు బనాయించారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. చంద్రబాబు గారిని 53 రోజులు అన్యాయంగా జైల్లో నిర్బంధించారు. వీటన్నిటిపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఆ ఉద్యమ స్ఫూర్తితోనే దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 94 శాతం సీట్లు గెలిచాం. వైసీపీ అహంకారం వల్లే 11 సీట్లకు పరిమితమైంది. మనం ఆ తప్పు చేయకూడదు. నాకు రాష్ట్రంలో మూడో అత్యధిక మెజార్టీ వచ్చిందని అహంకారానికి పోను. ఇది నాపై బాధ్యతను పెంచింది. ప్రజలు అహంకారాన్ని సహించరని అందరూ గుర్తుంచుకోవాలి" అని హితవు పలికారు.

పార్టీలో సరికొత్త సంస్కరణలు
పార్టీలో అంతర్గత సంస్కరణలపై లోకేశ్ కీలక ప్రకటనలు చేశారు. "పార్టీలో ఒకే వ్యక్తి ఒకే పదవిలో మూడుసార్లు కంటే ఎక్కువగా ఉండకూడదు. క్లస్టర్ ఇంఛార్జ్ స్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు ఎదిగేలా మార్పులు తీసుకురావాలి. గ్రామ పార్టీ అధ్యక్షుడు కూడా పొలిట్ బ్యూరోలో కూర్చోవాలి. ఈ మార్పుల కోసం నేను నాలుగేళ్లుగా పోరాడుతున్నా. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇది నాకు నాలుగోసారి. ఈసారి ఆ బాధ్యత వద్దని, వేరేవారికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు గారిని కోరాను" అని తెలిపారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ ‘మై టీడీపీ’ యాప్ ద్వారా కార్యకర్తల పనితీరును నేరుగా గుర్తిస్తామని చెప్పారు. "ఇకపై మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. పనిచేసేవారికీ, చేయనివారికీ తేడా స్పష్టంగా తెలుస్తుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు రాష్ట్రంలో ఉత్తమ పనితీరు కనబరిచిన 19 మంది కార్యకర్తలను చంద్రబాబు గారితో పాటు వేదికపై కూర్చోబెడతాం. కార్యకర్తే అధినేత అనేది మా నినాదం" అని లోకేశ్ ఉద్ఘాటించారు.

పార్టీయే సొంతిల్లు.. ప్రభుత్వ బాధ్యతలు కిరాయి ఇల్లు
తాను వారంలో ఒకరోజు తప్పనిసరిగా పార్టీ కార్యాలయానికి సమయం కేటాయిస్తున్నానని, పార్టీకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని లోకేశ్ స్పష్టం చేశారు. "తెలుగుదేశం పార్టీ మన సొంతిల్లు, ప్రభుత్వం కిరాయి ఇల్లు లాంటిది. మనమంతా కలిసికట్టుగా పనిచేస్తే 175 స్థానాల్లో విజయం సాధించవచ్చు. నాకు 91 వేల మెజార్టీ వచ్చినా, కొన్ని బూత్‌లలో వెనుకబడ్డాం. వాటిపై ఇప్పటినుంచే దృష్టి సారించాను. బలహీనంగా ఉన్న బూత్‌లను బలోపేతం చేసే బాధ్యత క్లస్టర్ ఇంఛార్జ్‌లు తీసుకోవాలి" అని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో జరిగిన దాడులను మర్చిపోవద్దని, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుధాకర్, అమర్ నాథ్ గౌడ్, తోట చంద్రయ్య వంటి వారిపై జరిగిన అన్యాయాలను ప్రజలకు వివరించి చైతన్యం తీసుకురావాలని సూచించారు.
Go Back to Shorts
Nara Lokesh
TDP
Telugu Desam Party
Andhra Pradesh
Chandrababu Naidu
Mangalagiri
Party Reforms
My TDP App
AP Politics
Training Programs

More Telugu News