Paparao: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు పాపారావు లొంగుబాటు

Paparao Surrenders Top Maoist Leader Gives Up in Bastar
షార్ట్స్‌లో చూడండి
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ను నక్సల్ రహితంగా మారుస్తామని ప్రభుత్వం విధించుకున్న గడువుకు వారం రోజుల ముందే ఒక చారిత్రక పరిణామం చోటుచేసుకుంది. బస్తర్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న చివరి అగ్రశ్రేణి మావోయిస్టు కమాండర్ పాపారావు అలియాస్ సున్నం చంద్రయ్య అలియాస్ మంగు తన సాయుధ బృందంతో సహా పోలీసులకు లొంగిపోయాడు. ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

56 ఏళ్ల పాపారావు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సీనియర్ సభ్యుడు. ఇతను బీజాపూర్ జిల్లాలోని కుట్రు పోలీస్ స్టేషన్‌లో 17 మంది అనుచరులతో (10 మంది పురుషులు, 8 మంది మహిళలు) కలిసి లొంగిపోయాడు. వీరి నుంచి 8 ఏకే-47 రైఫిళ్లు, ఒక ఎస్ఎల్‌ఆర్, ఒక ఇన్సాస్ రైఫిల్‌ను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. పాపారావు తలపై రూ.2 కోట్ల రివార్డు ఉంది. హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత బస్తర్‌లో మోస్ట్ వాంటెడ్ నక్సలైట్‌గా పాపారావు ఉన్నాడు. అతడిపై 50 కేసుల వరకు ఉన్నాయి. సుక్మా జిల్లా కలెక్టర్ ను కిడ్నాప్ చేసిన ఘటనలోనూ, గతంలో 76 మంది భద్రతా సిబ్బందిని బలిగొన్న ఘటనలోనూ పాపారావు హస్తం ఉందని భావిస్తున్నారు.

ఈ విషయాన్ని ఛత్తీస్‌గఢ్ హోం మంత్రి, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ధృవీకరించారు. పాపారావు లొంగుబాటుతో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ఇక క్రియాశీల సభ్యులెవరూ లేరని ఆయన తెలిపారు. లొంగిపోయే ముందు తాను పాపారావుతో ఫోన్‌లో మాట్లాడినట్లు వెల్లడించారు. రాష్ట్రం వెలుపల కేవలం ఇద్దరు అగ్ర నేతలు మిషిర్ బెస్లా, గణపతి మాత్రమే మిగిలి ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. పాపారావు లొంగుబాటుతో బస్తర్‌లో సాయుధ నక్సలిజం పూర్తిగా అంతమైందని ప్రభుత్వం ప్రకటించింది.

అయితే, ఈ పరిణామంపై రాష్ట్ర కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. గడువు ముగిసిన తర్వాత అమాయక ఆదివాసులపై వేధింపులు పెరిగే ప్రమాదం ఉందని, వారిపై నక్సలైట్లు అనే ముద్ర వేసి అరెస్టులు చేయవచ్చని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దీపక్ బైజ్ హెచ్చరించారు. బస్తర్ సహజ వనరులను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించే ప్రమాదం కూడా ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Paparao
Chhattisgarh
maoist surrender
Bastar
Naxalites
Vijay Sharma
Sukma district
Dandakaranya
Deepak Baij
Naxal free Bastar

More Telugu News