నో స్టాక్... హైదరాబాదులో మూతపడుతున్న పెట్రోల్ బంకులు!

హైదరాబాద్ నగరంలో మంగళవారం నాడు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక పెట్రోల్ బంకులు 'నో స్టాక్' బోర్డులు పెట్టి మూసివేయడంతో, తెరిచి ఉన్న కొన్ని బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు కనిపించాయి. రాష్ట్రంలో ఎక్కడా ఇంధన కొరత లేదని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది.

నగరంలోని ఉప్పల్, మల్లాపూర్, ఘట్‌కేసర్, అత్తాపూర్, కాటేదాన్, చంద్రాయణగుట్ట వంటి ప్రాంతాల్లో చాలా పెట్రోల్ పంపులు మూతపడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కొన్నిచోట్ల తెరిచి ఉన్న బంకుల వద్ద కార్లు, ఆటోలు, బైక్‌లతో భారీ రద్దీ నెలకొంది. నాంపల్లిలో సీఎన్‌జీ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద ఆటోలు గంటల తరబడి బారులు తీరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

ఈ పరిణామాలపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ స్పష్టత ఇచ్చింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ లేదా వంట గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని ప్రకటన చేసింది. కొన్ని తప్పుడు వదంతుల కారణంగా ప్రజలు ఆందోళనకు గురై, తమ వాహనాలకు ట్యాంకులు నింపుకోవడానికి ఒక్కసారిగా బంకులపై పడటంతో ఈ కృత్రిమ కొరత ఏర్పడిందని వివరించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ముందస్తు చెల్లింపుల విధానంలో చేసిన మార్పుల వల్ల కొందరు డీలర్లకు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైన మాట వాస్తవమేనని, కానీ సరఫరాపై దీని ప్రభావం లేదని పేర్కొంది.

ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేసినా, బ్లాక్ మార్కెట్‌కు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రజలు వదంతులను నమ్మవద్దని, ఆందోళన చెందవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ 'ఎక్స్' వేదికగా విజ్ఞప్తి చేశారు. నగరంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని ఆయన తెలిపారు. ఏదైనా సమాచారం కోసం 1967 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.


More Telugu News