YSRCP Room Number 11: పార్లమెంట్ లో వైసీపీకి రూమ్ నెంబర్ 11 కేటాయింపు.. ఆ రూమ్ వద్దంటూ స్పీకర్ ను కలిసిన వైసీపీ ఎంపీలు!

YSRCP Requests Change of Room No 11 in Parliament
షార్ట్స్‌లో చూడండి

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం '11' అనే అంకె వైసీపీకి ఒక పీడకలగా మారింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైన ఆ పార్టీని సోషల్ మీడియాలో ప్రత్యర్థులు '11' అంటూ ఒక రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఢిల్లీలోని కొత్త పార్లమెంటు భవనంలో కూడా అదే నంబర్ ఎదురవ్వడం వైసీపీ ఎంపీలను విస్మయానికి గురిచేసింది.


ఏం జరిగిందంటే..?

పార్లమెంటులో పార్టీల బలాబలాల ఆధారంగా స్పీకర్ కార్యాలయం గదులను కేటాయిస్తుంది. ఈ క్రమంలో వైసీపీ ఎంపీల కోసం మొదటి అంతస్తులో 11వ నంబర్ గదిని కేటాయించారు. ఈ విషయం తెలిసిన వెంటనే వైసీపీ ఎంపీలు ఒక్కసారిగా కంగారుపడ్డారు. "బయట ఇప్పటికే 11 అంటూ ఎగతాళి చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే నంబర్ ఉంటే మా పరిస్థితి ఏంటి?" అని చర్చించుకున్న నేతలు, వెంటనే స్పీకర్‌ను కలిశారు.


తమకు కేటాయించిన 11వ నంబర్ గదిని మార్చాలని కోరుతూ ఎంపీలు విజ్ఞప్తి చేయగా, స్పీకర్ తొలుత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గది నెంబర్ మార్చడం ఎందుకు? అని ఆయన ప్రశ్నించగా... ఏపీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ అంకె తమకు కలిసి రావడం లేదని, సెంటిమెంట్ పరంగా ఇబ్బందిగా ఉందని వారు వివరించారు. వారి మొర ఆలకించిన స్పీకర్, చివరకు ఆ గదిని మార్చి 12వ నంబర్ గదిని కేటాయించడంతో వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.


మరోవైపు, ఏపీలో భారీ విజయం అందుకున్న తెలుగుదేశం పార్టీకి పార్లమెంటు మొదటి అంతస్తులో 9వ నంబర్ గదిని కేటాయించారు. ఎన్డీయే ప్రభుత్వంలో కింగ్‌మేకర్‌గా ఉన్న టీడీపీకి కీలకమైన గది కేటాయించడం విశేషం.

Go Back to Shorts
YSRCP Room Number 11
YSR Congress
AP Elections 2024
Andhra Pradesh
Parliament
Room Number 11
TDP
NDA
Speaker
Political Sentiment

More Telugu News