Chandrababu Naidu: జల్ జీవన్ మిషన్ 2.0పై కేంద్రంతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ... ఎన్నికల హామీల్లో ఇది కూడా ఒకటన్న చంద్రబాబు

Chandrababu Naidu Government Signs MoU with Center on Jal Jeevan Mission 20
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించే బృహత్తర లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'జల్ జీవన్ మిషన్ (జేజేఎం) 2.0' అమలు కోసం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. 2028 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో 'హర్ ఘర్ జల్' (ప్రతి ఇంటికి కుళాయి నీరు) లక్ష్యాన్ని సాకారం చేసేలా కేంద్రం, ఏపీ మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఢిల్లీలోని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకాలు చేశారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ హాజరుకాగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యాలయం నుంచి జూమ్ ద్వారా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వర్చువల్‌గా పాల్గొన్నారు. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి అశోక్ కుమార్ మీనా, ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. జల్ జీవన్ మిషన్‌ను 2028 వరకు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, "ప్రతి ఇంటికి సురక్షితమైన, స్థిరమైన తాగునీటిని అందించాలనేది మా ప్రభుత్వ లక్ష్యం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇది కూడా ఒకటి. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు" అని అన్నారు. ఇదే సమయంలో, గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కోరారు.

కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ వర్చువల్‌గా మాట్లాడుతూ, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జేజేఎం 2.0కు అనుమతి ఇచ్చామని తెలిపారు. "ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంపై ప్రధాని మోదీతో సంప్రదించారు. ఈ మిషన్ పొడిగింపు కోసం ఆయన చేసిన ప్రతిపాదనకు ధన్యవాదాలు. మొదటి దశలో 16 కోట్ల గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇచ్చాం. మిగిలిన 3 కోట్ల ఇళ్లకు సురక్షిత నీటిని అందించాల్సి ఉంది" అని ఆయన వివరించారు. ఏపీలో నీటి నాణ్యతను పరీక్షించేందుకు డ్వాక్రా మహిళల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

ఈ తాజా ఎంఓయూతో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో కుళాయిల నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయనున్నారు. గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థల ఆపరేషన్, మెయింటెనెన్స్‌కు ఏపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగానే నిర్వహణ బాధ్యతలను పంచాయతీలకు అప్పగించనుంది. త్వరలోనే ఏపీలోని జిల్లా కలెక్టర్లతో వర్చువల్ సమావేశం ఏర్పాటు చేసి, ప్రాజెక్టు లక్ష్యాలను నిర్దేశించుకుందామని కేంద్ర మంత్రి పాటిల్ తెలిపారు. 

జల్ జీవన్ మిషన్ విజయవంతానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని, దీనిని ఏపీ సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 2047 నాటి 'వికసిత భారత్' లక్ష్యం నెరవేరాలంటే ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు చేరడం అత్యంత కీలకమని ఆయన నొక్కిచెప్పారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Jal Jeevan Mission 2.0
Andhra Pradesh
AP Government
Drinking Water
Har Ghar Jal
Pawan Kalyan
Central Government
Rural Development
Water Supply

More Telugu News