Koneru Humpy: యుద్ధనౌకల నీడలో చెస్ ఆడలేను: క్యాండిడేట్స్‌ టోర్నీ నుంచి కోనేరు హంపి సంచలన నిష్క్రమణ

Koneru Humpy Withdraws from Candidates Tournament Citing War Concerns
షార్ట్స్‌లో చూడండి

పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో భారత చెస్ స్టార్ కోనేరు హంపి అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిష్ఠాత్మకమైన క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. యుద్ధ ప్రాంతానికి చేరువలో ఉన్న సైప్రస్ ద్వీప దేశంలో, యుద్ధనౌకల పహారా మధ్య ప్రశాంతంగా కూర్చుని ఎత్తులు వేయడం సాధ్యం కాదని ఆమె చెప్పారు. ఒక మహిళగా, విదేశీయురాలిగా అంతటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య ప్రయాణించి ఏకాగ్రతతో ఆడటం అసాధ్యమని హంపి అభిప్రాయపడ్డారు. 


ఈ టోర్నీ కోసం తన కుమార్తెకు దూరంగా ఉండి మూడు నెలల పాటు కఠినంగా శ్రమించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు ఆటను ఆస్వాదించేలా లేవని హంపి ఆవేదన వ్యక్తం చేశారు. సైప్రస్‌కు వెళ్లవద్దంటూ అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఇప్పటికే 'లెవెల్-3' హెచ్చరికలు జారీ చేశాయని ఆమె గుర్తు చేశారు. ఇదే క్రమంలో అంతర్జాతీయ వేదికలపై ఉన్న ద్వంద్వ ప్రమాణాలను కూడా ఆమె ప్రశ్నించారు. జమ్మూకశ్మీర్‌లో కూడా లెవెల్-3 హెచ్చరికలే ఉన్నాయని, మరి అక్కడ ఇలాంటి టోర్నీలు నిర్వహించడంలో తప్పేముందని ఆమె నిలదీశారు. కేవలం విలాసవంతమైన రిసార్టులు ఉంటే సరిపోదని, చెస్ వంటి మేధోపరమైన క్రీడకు ఆహ్లాదకరమైన వాతావరణం కూడా అవసరమని హంపి స్పష్టం చేశారు. సైప్రస్ వంటి ప్రాంతాలు భారత్‌లో ఎన్నో ఉన్నాయని, ఇక్కడే టోర్నీని నిర్వహించవచ్చు కదా? అని ఆమె సూచించారు.


ఇదే టోర్నీలో పాల్గొంటున్న ఇతర భారత క్రీడాకారులు ప్రజ్ఞానంద, వైశాలి, దివ్య దేశ్‌ముఖ్‌ల నిర్ణయాల గురించి మాట్లాడేందుకు హంపి నిరాకరించారు. ఎవరి వ్యక్తిగత ఆసక్తులు, ఆందోళనలు వారికి ఉంటాయని, తన నిర్ణయం మాత్రం తనకు సరైనదేనని ఆమె స్పష్టం చేశారు. కాగా, హంపి తప్పుకోవడంతో ఆమె స్థానంలో ఉక్రెయిన్ క్రీడాకారిణి, మాజీ ఛాంపియన్ అనా ముజిచుక్‌ను ఫిడె ఎంపిక చేసింది.

Go Back to Shorts
Koneru Humpy
Candidates Tournament
Chess Tournament
Cyprus
Ukraine
Anna Muzychuk
Chess
FIDE
War
West Asia

More Telugu News