Rangareddy: తల్లి శవం పక్కన రాత్రంతా రెండేళ్ల చిన్నారి.. రంగారెడ్డి జిల్లాలో హృదయ విదారక ఘటన

Rangareddy Woman Murdered Two Year Old Daughter Found Beside Body
షార్ట్స్‌లో చూడండి
అమ్మ ఎంత పిలిచినా పలకడం లేదు. రాత్రంతా చలిలో, చీకట్లో ఆ పసి ప్రాణం ఆమెను లేపేందుకు ప్రయత్నించింది. ఆకలితో, భయంతో చేసిన రోదన అరణ్య రోదనగానే మిగిలింది. రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌ మండలం రంగారెడ్డిగూడ శివారులో జరిగిన ఈ హృదయ విదారక ఘటన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. ఓ మహిళను దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేయగా, ఆమె రెండేళ్ల చిన్నారి మాత్రం రాత్రంతా ఆ మృతదేహం పక్కనే ఏడుస్తూ ఉండిపోయింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రంగారెడ్డిగూడకు చెందిన శోభకు పదేళ్ల క్రితం మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిలకొండకు చెందిన వ్యక్తితో వివాహమైంది. వీరికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. మనస్పర్థల కారణంగా మూడేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయిన ఆమె, ఆ తర్వాత కోయిలకొండకే చెందిన నర్సింహులు అనే వ్యక్తితో సహజీవనం చేయడం ప్రారంభించింది. వీరికి రెండున్నరేళ్ల కుమార్తె ఉంది. అయితే, కొంతకాలంగా నర్సింహులుతో కూడా శోభకు గొడవలు జరుగుతుండటంతో ఆమె పుట్టింటికి వచ్చేసి తల్లితో కలిసి ఉంటోంది.

ఈ క్రమంలో శనివారం నర్సింహులు ఆమెకు ఫోన్ చేసి, కుమారుడికి సైకిల్ ఇప్పిస్తానని షాద్‌నగర్‌కు రమ్మని పిలిచాడు. కొడుకును తీసుకుని ఆమె షాద్‌నగర్ వెళ్లగా, ఎంతసేపటికీ అతను రాలేదు. దీంతో ఆమె తిరిగి ఇంటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత కుమారుడిని తల్లి వద్ద ఉంచి, తన రెండున్నరేళ్ల కుమార్తెతో కలిసి మళ్లీ బయటకు వెళ్లింది. ఆదివారం తెల్లవారుజామున గ్రామ శివారులోని ఓ పంట పొలంలో శోభ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. ఆమె తలపై బండరాయితో మోది హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

శనివారం రాత్రి ఈ దారుణం జరగ్గా, ఆ రాత్రంతా చిన్నారి తన తల్లి శవం పక్కనే ఏడుస్తూ ఉండిపోయింది. ఆదివారం ఉదయం అటుగా వెళ్తున్న గ్రామస్థులు చిన్నారి ఏడుపు విని, దగ్గరకు వెళ్లి చూడగా ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తల్లి కరుణమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శోభతో సహజీవనం చేస్తున్న నర్సింహులుపైనే అనుమానం వ్యక్తం చేస్తూ అతడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
Go Back to Shorts
Rangareddy
Shobha
Rangareddy murder
Telangana crime
Farooqnagar
Narasimhulu
Shadnagar
child near dead body
crime news telangana

More Telugu News